- ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ. 1.25కోట్లు విడుదల
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
- పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సిద్ధమవుతున్న అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఊరట లభించింది. గత వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనులకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి గత ఏడాదే ఈ నిధులు మంజూరయ్యాయి. అప్పట్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన ప్రక్రియతో జిల్లాకు రావాల్సిన ఈ నిధులు నిలిచిపోయాయి. తాజాగా ఈ నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రభుత్వం జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ విభాగానికి రూ.1.25 కోట్లను కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. 2014-15 సంవత్సరంలో వేసవిలో తాగునీటి సమస్యలనెదుర్కొనేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.
ఇందులో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటి, ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకోవడం, ప్రస్తుతమున్న బోర్లు ఫ్లషింగ్‌తో పాటు లోతు పెంచడం, బోరుమోటార్ల మరమ్మతులు తదితర పనుల్ని సీఆర్‌ఎఫ్ (విపత్తు నివారణ నిధి) కింద చేపట్టారు. దాదాపు రూ.1.21కోట్లతో పనులు పూర్తిచేశారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియతో ఈ ఫైలు అటకెక్కింది.
ఒకవైపు పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు నిధులకోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.1.25కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. గత బకాయిలు చెల్లించినప్పటికీ ఆర్‌డబ్ల్యూస్‌కు కొంత అదనపు నిధులు వలిసివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు వాటిని వినియోగించనున్నట్లు ఆ శాఖ ఇంజినీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
బకాయిలొచ్చాయ్..
Published Wed, May 6 2015 1:12 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement