పింఛన్ రాదేమోనని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మకూరు(ఎం): పింఛన్ రాదేమోనని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు(ఎం) గ్రామ పరిధి కామునిగూడెంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాద నర్సయ్య (70) వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. ఆసరా పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు కూడా చేసుకున్నాడు. శనివారం లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద అతికిస్తామని ఆధికారులు పేర్కొనడంతో నర్సయ్య అక్కడికి వెళ్లాడు.
అక్కడున్న అధికారులను అడిగాడు. జాబితా ఇంకా రాలేదని వారు చెప్పడంతో ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. ఏ అధికారీ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పింఛన్ రాదేమోనని మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి విద్యుత్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.