ఫ్లై ఓవర్‌ ప్లీజ్‌! | People Demanding Open Rajeev Gandhi Junction Flyover Bridge | Sakshi
Sakshi News home page

ఫ్లై ఓవర్‌ ప్లీజ్‌!

Published Fri, Apr 5 2019 7:36 AM | Last Updated on Sat, Apr 6 2019 11:44 AM

People Demanding Open Rajeev Gandhi Junction Flyover Bridge - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: మంజీరా మెజిస్టిక్‌ షాపింగ్‌ మాల్‌ నుంచి మలేషియన్‌ టౌన్‌పిష్‌ వైపు వెళ్లే రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ను వెంటనే అందుబాటులోకి తేవాల్సిందిగా సిటీజనుల నుంచి, నెటిజన్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వంతెనను వినియోగంలోకి తెస్తే ఈ మార్గం నుంచి ప్రయాణించే దాదాపు నాలుగైదు లక్షల మందికి ఊరట లభించడంతో పాటు, ట్రాఫిక్‌ చిక్కులు సైతం తీరుతాయి. ‘ఫ్లై ఓవర్‌ లేక ముందు.. నిర్మాణం ప్రారంభం కాకముందు.. ఎన్నో అవస్థలు భరించాం. ఫ్లై ఓవర్‌ పూర్తయింది. అనుమతించడానికి ఇబ్బంది ఏముంది? అందరికీ సమస్యలు తీరుతాయిగా. అసలెందుకు ప్రారంభించడం లేద’ంటూ అధికారులను పలువురు సామాజికమాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల వేదికగా ప్రశ్నిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో  ‘కోడ్‌’ ఉల్లంఘన అవుతుందేమోనని అధికారులుసంశయిస్తున్నారు. కోడ్‌ అడ్డువస్తే అధికారికంగా లాంఛనాలతో ప్రారంభోత్సవం చేయకపోయినా ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు. అనుమతిస్తే నిత్యం నిజాంపేట్, ప్రగతినగర్, కూకట్‌పల్లి మీదుగా హైటెక్‌సిటీకి వెళ్లే వారికి, అటు నుంచి ఇటు  వచ్చేవారికి ఎంతో మేలు జరుగుతుందనివెంటనే అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం, మలేషియా టౌన్‌షిప్‌ల మీదుగా హైటెక్‌సిటీకి వెళ్లేవారికి ట్రాఫిక్‌ నరకం తప్పుతుందంటున్నారు. ఈ మార్గంలో నిత్యం దాదాపు 1.60 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 

రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్‌ ఫ్లై ఓవర్‌..
మంజీరా మెజిస్టిక్‌ షాపింగ్‌మాల్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్‌ మలేషియా టౌన్‌షిప్‌ ముందు ముగుస్తుంది.జేఎన్‌టీయూ రోడ్, కేపీహెచ్‌బీ ఫేజ్‌–1, ఫేజ్‌–6, ఫేజ్‌–9 సంగమంగా ఉన్న ఈ జంక్షన్‌ వద్ద రద్దీ సమయాల్లో 66 శాతం జేఎన్‌టీయూ నుంచి హైటెక్‌ సిటీవైపు వెళ్లే వారే ఉంటున్నారు. ఈ వంతెన వినియోగంతో ఇందులో 94 శాతం సమస్య పరిష్కారమవుతుందని, హైటెక్‌సిటీలో ఐటీ రంగం అభివృద్ధికి ముందు ఉన్నంత రద్దీ మాత్రమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాజీవ్‌గాంధీ సర్కిల్‌ వద్ద రద్దీ తగ్గితే ట్రాఫిక్‌ కష్టాలు చాలా వరకు తగ్గినట్లే. హైటెక్‌ సిటీ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే వారికీ ఇదే సౌలభ్యంగా ఉంటుంది. 

ప్యాకేజీ–4 లో చేపట్టిన పనులు..
ప్యాకేజీ–4లో బయోడైవర్సిటీ జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, రాజీవ్‌గాంధీ జంక్షన్, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ పనులను మొత్తం రూ.379 కోట్ల వ్యయంతో చేపట్టారు. వీటిలో అయ్యప్ప సొసైటీ జంక్షన్, మైండ్‌స్పేస్‌ అండర్‌పాస్, మైండ్‌స్పేస్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చాయి. రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ పూర్తయింది. ఇప్పుడు ఈ వంతెనను అందుబాటులోకి తేవాలని ప్రజలను డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.  

ఫ్లై ఓవర్‌ వివరాలు ఇవీ..
వ్యయం:                   రూ.97.94 కోట్లు
పొడవు:                   1230 మీ.
వయడక్డ్‌ పొడవు:       780 మీ.
ఆబ్లిగేటరీ స్పాన్‌ పొడవు:  90 మీ.
అప్రోచెస్‌ పొడవు:         360 మీ.
వెడల్పు:                  20 మీ.
క్యారేజ్‌వే:        ఆరు లేన్లు (రెండువైపులా ప్రయాణం)
కాంట్రాక్ట్‌ ఏజెన్సీ:        ఎం.వెంకట్రావు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement