నర్సాపూర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. ప్రభుగౌడ్ అన్నారు. సోమవారం ఆయన నర్సాపూర్ వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చామని, తెచ్చామని ఆ పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. అమరుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారిని పట్టించుకున్న నాయకులే కరువయ్యారని ప్రభుగౌడ్ విచారం వ్యక్తం చేశారు. అమరుల కుటుంబ సభ్యులకు సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా తాము సంఘీభావం తెలుపుతామని స్పష్టం చేశారు.
ఆ రెండు పార్టీలు అధికార దాహంతో ముందుకు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆ పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. కాగా జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, పేదలందరికీ ఇళ్లు, ఇంకా అనేక పథకాలు వైఎస్ మంజూరు చేశారని ప్రభుగౌడ్ తెలిపారు. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తాయన్నారు.
వైఎస్ మరణం తర్వాత ఆయన చేపట్టిన పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచి పేదలను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు. సమావేశంలో ప్రభుగౌడ్‌తో పాటు పార్టీ జిల్లా బీసీ సెల్ నాయకుడు సుధాకర్‌గౌడ్, కొండాపూర్ మండల శాఖ అధ్యక్షుడు అశోక్ గౌడ్, సంగారెడ్డి మండలశాఖ అధ్యక్షుడు హరికృష్ణగౌడ్ పాల్గొన్నారు.
ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు
కౌడిపల్లి: ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారంకావని, గుండెనిబ్బరంతో ధైర్యంగా ముందుకుసాగాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. మండలంలోని వెల్మకన్నెలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు గొల్ల రమేష్ (34) కుటుంబ సభ్యులను సోమవారం ప్రభుగౌడ్ పరామర్శించారు.
రమేష్ ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం కలిసిరాక అప్పులు పేరుకుపోవడంతో ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్యలవల్ల సమస్యలు పరిష్కారంకావన్నారు. కార్యక్రమంలో పార్టీ బీసీసెల్ కొండాపూర్ మండలం అధ్యక్షుడు అశోక్‌గౌడ్, నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను ప్రజలు నమ్మరు
Published Tue, Mar 18 2014 12:00 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement