భయం.. భయం
నిర్మల్ : దేశం కాని దేశం.. ఉపాధి పొంది నాలుగు రాళ్లు సంపాదించుకుందామని అయిన వారిని వదులుకుని పోతే.. అక్కడా మనవాళ్లకు కష్టాలు తప్పడం లేదు. ఆ దేశంలో చోటుచేసుకున్న అల్లర్లు మన వాళ్లని గందరగోళానికి గురిచేయడమే కాకుండా ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంతో వలసవాదులు, వారి కుటుంబీకులు నానా హైరానా పడుతున్నారు. అక్కడ తమ వారు ఎలా ఉన్నారోనంటూ నిత్యం వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే.. జరుగుతున్న పరిణామాలతో అక్కడి వారిలోనూ, ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులూ భయాందోళనలకు గురవుతూనే ఉన్నారు.
నిత్యం క్షేమ సమాచారాలు..
అంతర్యుద్ధం దృష్ట్యా అక్కడ ఉన్న వారు నిత్యం తమ క్షేమ సమాచారాలను కుటుంబీకులకు చేరవేస్తూనే ఉన్నారు. జరుగుతున్న దాడులకు, జిల్లా వాసులు ఉన్న ప్రాంతాలకు దూరభారం ఎక్కువగా ఉన్నట్లు అక్కడ ఉన్న వారు పేర్కొంటున్నారు. అయితే.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ఆందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఓ పక్క ఉగ్రవాదులు ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామంటూ చెబుతుండగా, అక్కడి ప్రభుత్వ దళాలు మాత్రం తమ అధీనంలోనే ఆ ప్రాంతాలు ఉన్నాయంటూ ప్రకటనలు చేస్తోంది. దీంతో ఎవరి ప్రకటన నిజమో తెలియక అక్కడికి ఉపాధి కోసం వెళ్లిన తమ వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నారు.
కంపెనీలు ఇండియాకు పంపడం లేదు..
ఎనిమిది నెలల క్రితం నేను ఎలక్ట్రీషియన్ పనిమీద ఇరాక్‌కు వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆందోళనల మధ్యే పనిచేస్తున్నాను. వివిధ ప్రాంతాల ను ఆక్రమించుకుని, ఆజమాయిషి పెంచుకోవడానికి ఇరు జాతుల మధ్య దాడులు జరుగుతున్నాయి. మాకు సమీపంలోని కుర్దిస్థాన్ ఆర్బిల్ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. కొంత మంది ఇండియాకు వెళ్లిపోతామని కంపెనీలను అడిగినా క్యాంపుల్లోనే ఉంచుతున్నారు కానీ తిరిగి పంపడం లేదు. - కొక్కుల మహేశ్, ఖానాపూర్
రావడానికి సిద్ధంగా ఉన్న..
కుంటాల : బతుకుదెరువు కోసం భార్యపిల్లలను వదిలి రూ. 3 లక్షల అప్పు చేసి ఇరాక్ దేశానికి వచ్చాను. అకస్మాత్తుగా ఇక్కడ అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నం. నేను బాగ్దాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. భార్యాపిల్లలను వదిలి 8 నెలల క్రితం బతుకుదెరువు కోసం వచ్చాను. ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న. జిహాదీలు, ప్రభుత్వ భద్రత బలగాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తంది. నేను క్షేమంగానే ఉన్నానని ఇంటికి సమాచారం ఇచ్చా. స్వగ్రామానికి రావాలని నాతోపాటు మరో 20 మంది నిర్మల్, లక్ష్మణ్‌చాంద తదితర ప్రాంత వాసులు కంపెనీ ఎదుట రెండ్రోజులుగా ఎదురుచూస్తున్నం. అయినా.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలి.
- కూన గంగన్న, నందన్, కుంటాల మండలం
జిల్లా నుంచి 300ల మందికి పైనే..
ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక, చేసే వ్యవసాయం లాభసాటిగా లేక, తమ కుటుంబాలను ఆర్థికంగా మంచి స్థానాల్లో ఉంచాలన్న ఆశతో ఎంతో మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తున్నారు. అదే మాదిరిగా ఇరాక్ దేశానికి జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. దాదాపు 200 నుంచి 300 మంది వరకు అక్కడ వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. అయితే అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధంతో వలదారుల్లో, కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి.