భూ పంపిణీ డౌటే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితుల భూ పంపిణీ పథకం ఇంకా బాలారిష్టాలు పడుతోంది. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల చొప్పున భూమిని పంచుతామని సర్కారు ప్రకటించింది. ఈ నెల 15న ఈ పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితులను చూస్తే పంపిణీ సాధ్యమయ్యేటట్లు లేదు. మొదట మండలానికో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే కూడా నిర్వహించారు. భూమి కొనుగోలు చేయడానికి వీలుకాని పటాన్‌చెరు, రామచంద్రాపురం మండలాలు మినహా మిగతా 44 మండలాల్లో ప్రాథమిక సర్వే చేశారు. అయితే తగినంత సమయం లేకపోవడం, భూ కొనుగోలు సమస్యగా మారటంతో నియోజకవర్గానికో గ్రామం గా సవరించారు. దీంతో ఆశలు పెంచుకున్న దళితులు నిరాశకు గురవుతున్నట్టు తెలుస్తోంది.
ఆ క్షణం కోసం ఎదురుచూపు..
కచ్చితంగా ప్రతి దళిత కటుంబానికి మూడు ఎకరాల భూమి ఇచ్చి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చె ప్తున్నప్పటికీ,. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న తొలి సంక్షేమ ఫలం ఇది. సహజంగానే దళిత ప్రజలు దీనిపై ఆశలు పెంచుకున్నారు. ఇంతకాలం వలసలతో కాలం గడిపిన దళితులకు జీవితంలోనే మొదటిసారి మూడు ఎకరాల భూమికి ఆసామి అవుతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇలాంటి మధుర ఫలాలు అనుకున్న సమయంలో చేరితేనే దానికి సార్థకత ఉంటుంది. ఇదిగో వచ్చే.. అదిగో ఇస్తున్నామని ఊరించి... ఉడికించి ఇవ్వడం వల్ల ప్రభుత్వం పలుచన అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆలస్యం కావచ్చు...
పథకం ప్రారంభానికి కేవలం 13 రోజులే ఉన్నప్పటికీ ఇప్పటివరకు అధికారులు ఒక్క ఎకరం భూమి కూడా సేకరించలేదు. భూ పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వం కేవలం రూ.25 లక్షల నిధులను మాత్రమే మంజూరు చేసింది. ప్రస్తుతం కేవలం 10 గ్రామాల్లో మాత్రమే పథకాన్ని అమలుచేస్తున్నారు. అక్కడ కూడా ప్రాథమిక సర్వే మాత్రమే పూర్తిచేశారు. తుది లబ్ధిదారుల జాబితా ఇంకా ఎంపిక చేయనేలేదు. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది.
ఎంపిక చేసిన గ్రామాలివే....
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కిష్టాపూర్, దుబ్బాకలో లక్ష్మీనగర్, మెదక్‌లో సూరారం, సంగారెడ్డిలో మాడిపెల్లి, పటాన్‌చెరులో నల్లవల్లి, అందోల్ నియోజకవర్గంలో అంతారం, జహీరాబాద్‌లో గోడిగర్గపల్లి, నర్సాపూర్‌లో మూసాపేట్, సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడక, గజ్వేల్ నియోజకవర్గంలో అంకిరెడ్డిపల్లి గ్రామాలను తొలి విడతలో ఎంపిక చేశారు. ఈ పది గ్రామాల్లో మొత్తం 921 దళిత కుటుంబాలను గుర్తించారు. తదుపరి సర్వేలో అర్హులను గుర్తించి తుది లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తారు.
లక్ష్యం సరే...
తొలి విడతలో కనీసం 500 ఎకరాల భూమి కావాల్సి ఉంది. కానీ అధికారులు ఇప్పటివరకు ఎకరా కూడా సేకరించలేదు. కనీసం 200 ఫీట్లు బోర్లు వేస్తే నీళ్లు పడే సాగుకు యోగ్యమైన భూమిని సేకరించి దళిత కుటుంబాలకు అందిస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. ఒకే చోట సాగుకు యోగ్యమైన భూమి ఏకమొత్తంలో దొరకటం సాధ్యం కావటం లేదు. పైగా నాణ్యమైన భూమికి.. ఎకరాకు రూ. 4 లక్షల నుంచి ఆపైనే పలుకుతోంది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ 2. లక్షల నుంచి రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో భూమి ఎక్కడ దొరుకుతుందో కూడా వివరాలను సేకరించలేదు. ఈ మొత్తం పక్రియ పూర్తయి లబ్ధిదారునికి భూ పత్రాలు చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.