
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బి.వినోద్‌కుమార్, కె.కవిత, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో, ప్రగతిపథం వైపు రాష్ట్రం వేస్తున్న అడుగులో జయశంకర్ లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్ర అభివృద్ధికి జయశంకర్‌తో కలసి రూపొందించుకున్న బ్లూప్రింట్‌నే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. 1952 నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలపై జయశంకర్ రాసి పెట్టుకున్న విషయాలే ఉద్యమాన్ని నడిపేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. పోరాటంలో నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే దేన్నైనా సాధించవచ్చనేందుకు ఆయన జీవితమే నిదర్శనమన్నారు.
జయశంకర్ ఆశయాన్ని నెరవేర్చింది కేసీఆరే
జయశంకర్ జయంతి వేడుకలోమంత్రుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ జీవిత ఆశయాన్ని నెరవేర్చింది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రులు జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ చిరస్మరణీయుడు: కేసీఆర్
ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన ప్రొఫెసర్ జయశంకర్ చిరస్మరణీయుడని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం ఆయనను గుర్తు చేసు కున్నారు. ఆయన ఆత్మ సంతృప్తి చెందేలా తెలంగాణ లో 50 నెలల అభివృద్ధి ప్రస్థానం సాగిందన్నారు.