కేసీఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త ప్రొ.జయశంకర్ జయంతి వేడుకులని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి తెరాస శ్రేణులు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రొ.జయశంకర్‌ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమానికి సురేష్ గోపతి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్రా గొప్పదని, తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆ జన్మ బ్రహ్మచారి కొత్తపల్లి జయశంకర్ అని అన్నారు. నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మలి దశ తెలంగాణ సాధన పోరాటం వరకూ ఆయన పాత్ర చిరస్మరణీయమని, కడవరకూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే జయశంకర్ పని చేశారని, అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సంతోష సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం చాల బాధాకరం అని పేర్కొన్నారు.
గోలి తిరుపతి మాట్లాడుతూ.. అనుకున్నఆశయ సాధనకై జయశంకర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. జయశంకర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని, రాబోయే తరాలకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని కొనియాడారు.
రంగు వెంకట్ మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ సంఘాలన్నీ జయశంకర్ మానసపుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో ప్రవాస తెలంగాణవాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సంస్థ వ్యవస్ధాపకుడు సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రొ.జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్‌ను అందజేసినట్లు చెప్పారు. తెలంగాణ యూకే జాగృతి అధ్యక్షులు సుమన్ బలమూరి, సభ్యులు లండన్ గణేష్, జేటీఆర్‌డీసీ అధ్యక్షులు సృజనా రెడ్డి చాడ, సభ్యులు మధు అందేం, యూకే లో స్థిరపడి, బీబీసీ సంస్థలో పనిచేసిన కరీంనగర్ జిల్లా వాసి భారతి, కేసీఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే సంస్థ సభ్యులు గోలి తిరుపతి, భాస్కర్ మొట్ట, ప్రశాంత్, శ్రీధర్ , రఘు నక్కల, నరేష్ మర్యాల, వెంకట్ రంగు, వేణు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.