
ఐడీపీఎల్‌లో మూసి ఉన్న పెట్రోల్ బంక్
సాక్షి,సిటీబ్యూరో: పెట్రోల్ బంకులు తెరిచే ఉన్నా.. వాహనదారుల తాకిడి మాత్రం కనిపించలేదు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర సేవల్లో భాగంగా నగరంలోని పెట్రోల్ బంకులు తెరిచే ఉంచినప్పటికీ వినియోగదారుల సందడి మాత్రం కనిపించ లేదు. వాస్తవంగా పెట్రోల్ బంకుల ముందు బారికేడ్లను ఏర్పాటు చేసి ఒకరిద్దరు సిబ్బందితో మొక్కుబడిగా తెరిచి ఉంచారు. దీంతో అత్యవసర అవసరాల కోసం రోడ్డెక్కిన వాహనాలు సైతం బారికేడ్ల కారణంగా ఇంధనం కోసం బంకుల్లోకి వెళ్లలేకపోయారు.
సాయంత్రం ఐదు గంటల వరకు లక్డీకాపూల్‌లో పెట్రోల్ బంకు తప్ప మిగితా పెట్రోల్ బంకులకు కనీస వాహనాల తాకిడి లేకుండా పోయింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత స్పల్పంగా వాహనాలు రోడ్లపై రావడంతో కొన్ని పెట్రోల్ బంకుల్లో స్వల్పంగా రద్దీ కనిపించింది. వాస్తవంగా మహా నగరంలో ప్రతి నిత్యం సగటున 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. కరోనా వైరస్ విస్తరించకుండా విద్యా సంస్థలకు సెలవులు, సినిమా హాల్స్, పర్యాటక ప్రాంతాలు మూసివేత, ప్రైవేటు సంస్థలు హోం టూ వర్క్ ప్రకటించడంతో గత వారం రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సగానికి పైగా అమ్మకాలు పడిపోయాయి. తాజాగా ఆదివారం జనతా కరŠూప్యతో అమ్మకాలు కనీసం ఒక శాతం కూడా జరగలేదని సమాచారం. ప్రజారవాణా ఆగిపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.