ఫైనల్‌ టచ్‌..! అతిరథులు  సుడిగాలి పర్యటనలు | Phainal‌ ṭac‌..! Atirathulu suḍigāli paryaṭanalu 42/5000 Final touch ..! Tornado tours with guests | Sakshi
Sakshi News home page

ఫైనల్‌ టచ్‌..! అతిరథులు  సుడిగాలి పర్యటనలు

Published Sun, Dec 2 2018 10:21 AM | Last Updated on Sun, Dec 2 2018 10:21 AM

 Phainal‌ ṭac‌..! Atirathulu  suḍigāli paryaṭanalu 42/5000 Final touch ..! Tornado tours with guests - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల ప్రచారం ముగిసే సమయం సమీపిస్తుండ డంతో అన్ని పార్టీల అతిరథ నేతలందరూ మరోసారి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 5తో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అగ్రనేతల షె డ్యూళ్లు ఖరారయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ముఖ్యనేతలపైనే ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వారు మిగిలిన నియోజకవర్గాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు.

అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికలను అ త్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అ తిథుల రాకకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా ఇప్పటికే రెండుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కేసీఆర్‌.. నాగర్‌కర్నూల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.

అలాగే డిసెంబర్‌ 4న ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల ప్రచారసభలు నిర్వహించనున్నారు. ఇక కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం మరోసారి ఉమ్మ డి జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే కొడం గల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన సభలో పాల్గొనగా... ఈసారి గద్వాలలో నిర్వహిం చే సభలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు.  


ఆశలన్నీ కేసీఆర్‌పైనే.. 
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరోసారి ఎట్టి పరిస్థితిలో అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుపొందాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బరిలో నిలిచిన నేతలందరూ ఆశలన్నీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీదే పెట్టుకున్నారు.

దీంతో ఆయన కూడా ప్రతీ నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేశాక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి వనపర్తిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత జడ్చర్లలో జరిగిన సభకు హాజరైన కేసీఆర్‌.. మరోమారు దేవరకద్ర, నారాయణపేట సభల్లో పాల్గొని మాట్లాడారు. తాజాగా ఒకేరోజు మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట సభకు హాజరయ్యారు.

ఇప్పుడు ఆదివారం నాగర్‌కర్నూల్‌లో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత 4న ఒకే రోజు ఉమ్మడి జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్, కొండగల్‌లో జరిగే ప్రచార సభల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే మంత్రి కేటీఆర్‌ కూడా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితుల చోట్ల సభలు నిర్వహించి.. కేడర్‌ను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

కల్వకుర్తి, మక్తల్, అచ్చంపేటలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. అదే విధంగా ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న చోట్ల.. ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టేందుకు టీఆర్‌ఎస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావును నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా నియమించారు.

అలంపూర్, గద్వాల్, మక్తల్, కొడంగల్‌లో పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు నడిపించేందుకు హరీశ్‌ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పలుమార్లు పర్యటించిన హరీశ్‌.. కొందరిని నియోజకవర్గంలో నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలా మొత్తం మీద టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.  


వ్యూహాత్మకంగా ప్రజాఫ్రంట్‌ 
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి సైతం సర్వశక్తులు ఒడ్డుతోంది. టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలందరూ కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

అన్నిచోట్ల కూడా కూటమి నాయకులుకలిసి బరిలో నిలిచిన అభ్యర్థి ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీలోని జాతీయ స్థాయి నేతలు, టీ పీసీసీ ముఖ్యనేతలందరూ విస్తృతంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలను టార్గెట్‌ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు.

గత నవంబర్‌ 28న కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. ప్రత్యర్థి పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీలపై రాహుల్‌ ధీటైన విమర్శలు చేస్తున్నారు. రాహుల్‌ సభల ద్వారా కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్‌ నెలకొనడంతో.. ఈనెల 3న గద్వాలలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. 


కమలం ‘గురి’ 
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సైతం తన పట్టును నిలుపుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తోంది.  ఉమ్మడి జిల్లా కొన్ని స్థానాలైనా గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తోంది. పలు సర్వేల్లో కల్వకుర్తి, నారాయణపేటల్లో పార్టీ అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నట్లు వెల్లడైందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా కనీసం ఈ రెండు స్థా నాలను గెలిచి తీరాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పాలమూరు సభ ద్వారా కేడర్‌లో జోష్‌ నింపారు. మరోవైపు మంచి వాగ్దాటి ఉన్న స్వామి పరిపూర్ణానంద స్వామి కూడా ఆయా నియోజకవర్గాల్లో ప ర్యటించారు.

హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పా టు జె.పి.నడ్డా తదితరులు సైతం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో వ్యూహకర్తగా పేరున్న జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యూ హాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పాలమూరు నుంచే ప్రా రంభించిన నేపథ్యంలో... తాజాగా ఆయన మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని నారా యణపేట, కల్వకుర్తి(ఆమనగల్‌)ల్లో ఆదివారం జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement