
ఫొటోగ్రాఫర్ దారుణహత్య
తాండూర్ మండల కేంద్రానికి చెందిన ఎల్లేరి సతీశ్, తన భార్య శుక్లతో కలిసి రెండున్నర నెలల క్రితం బెల్లంపల్లికి వలసవచ్చాడు.
బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం రాత్రి ఓ ఫొటోగ్రాఫర్ దారుణ హత్యకు గురయ్యాడు. వాహన క్లచ్ వైరుతో ఉరేసి కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సీఐ బానోతు బాలాజీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బెల్లంపల్లి : తాండూర్ మండల కేంద్రానికి చెందిన ఎల్లేరి సతీశ్, తన భార్య శుక్లతో కలిసి రెండున్నర నెలల క్రితం బెల్లంపల్లికి వలసవచ్చాడు. ఓ వాహన షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తున్న సతీశ్ పట్టణంలోని అశోక్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. తాండూర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ కొడిపే నర్సింహులు(25)తో కొంతకాలం నుంచి సతీశ్‌కు పరిచయం ఉంది.
తాండూర్‌లో పక్కపక్క ఇళ్లలోనే నివసించడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పాత పరిచయం దృష్ట్యా నర్సింహులును సతీశ్ ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన ఇంటికి రమ్మన్నాడు. స్నేహితుడు పిలవడంతో అదేరాత్రి అతడి ఇంటికి నర్సింహులు చేరుకున్నాడు. చీకటి పడడంతో నర్సింహులు రాకను ఎవరూ గమనించలేదు.
అప్పటికే చుట్టుపక్కల నివసిస్తున్నవారు నిద్రలోకి జారుకోవడం, బస్తీ పరిసరాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారడంతో అదే అదునుగా భావించిన సతీశ్, అతడి భార్య శుక్ల, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కలిసి పథకం ప్రకారం వాహన క్లచ్ వైరుతో నర్సింహులు మెడకు ఉరేసి దారుణంగా హత్య చేశారు. అప్పటికే మెలకువ వచ్చి ఇంటి యజమాని దుర్గం బాపు బయటకురాగా గమనించిన సతీశ్, శుక్ల, మరో ఇద్దరు ఇంట్లో నుంచి చాకచక్యంగా పారిపోయారు. అనుమానంతో బాపు వెళ్లి చూడగా నర్సింహులు మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అదే రాత్రి సీఐ బా లాజీ, వన్‌టౌన్ ఎస్సై ఎన్.సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
మృతుడి ప్యాంట్ జేబులో కండోమ్స్ ప్యాకెట్లు లభించాయి. దీం తో వివాహేతర సంబంధం నేపథ్యంలో నర్సిం హులు హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం డీఎస్పీ కె.ఈశ్వర్‌రావు హత్య జరిగిన స్థలాన్ని పరిశీ లించారు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.