
ప్లే బాయ్ క్లబ్‌పై దాడి
- 11 మంది అరెస్ట్
గచ్చిబౌలి: మాదాపూర్‌లోని ప్లే బాయ్ క్లబ్‌పై బీజేవైఎం కార్యకర్తలు దాడికి యత్నించారు. హెచ్‌ఐసీసీలోకి చొచ్చుకుపోయి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిబాబుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో కార్లలో హెచ్‌ఐసీసీ సెక్యూరిటీ కళ్లుగప్పి లోపలికి ప్రవేశించారు. బౌన్సర్‌లు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చొచ్చుకొని ఒక్కసారిగా లోపలికి వెళ్లారు.
రెండు టీపాయిలను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడే బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నోవాటెల్ సమీపంలో సైబర్‌సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో ఓ వివాహనికి హాజరైన తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బందో బస్తులో ఉన్న మాదాపూర్ పోలీసులు హుటాహుటిన హెచ్‌ఐసీసీకి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
క్లబ్‌ను మూసి వేయాలి
భారతీయ సంస్కృతిని కించ పరిచేవిధంగా నడిచే ప్లేబాయ్ క్లబ్‌ను వెంటనే మూసివేయాలని బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాల్‌రెడ్డి, హరికృష్ణలు డిమాండ్ చేశారు. ఇలాంటి క్లబ్‌లకు అనుమతిస్తే యువత పెడదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లే బాయ్ క్లబ్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చే యాలని వారు డిమాండ్ చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఏసీపీ
నగరంలో ఉన్న పబ్‌లకు వర్తించిన నిబంధనలు ప్లే బాయ్ క్లబ్‌కు వర్తిస్తాయని మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. అర్థ నగ్న, అశ్లీల నృత్యాలను సహించమని స్పష్టం చేశారు.