
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ వివరాలివ్వండి
హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏమిటో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సాగర్ చుట్టూ నిర్మాణాలపై వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏమిటో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాగర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌టీఎల్)కు సంబంధించిన వివరాలను కూడా తమ ముందుంచాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ రజనీల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
సుప్రీంకోర్టుఆదేశాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీ నిర్మాణాలను చేపడుతుందని.. వీటిని నిలుపుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిల్‌పై ధర్మాసంన విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సాగర్ ఒడ్డున ఉన్న అంబేడ్కర్ నగర్ మురికివాడలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వు లకు విరుద్ధమని తెలిపారు. ఏజీ కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే పిటిషనర్‌కు ఉన్న అభ్యంతరం ఏమిటో తెలియడం లేదన్నారు. సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్‌లో గానీ నిర్మాణాలు చేపట్టడం లేదని వివరించారు.