
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు తాత్కాలిక షెడ్యూల్ ఖరారైంది. గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం.. ఈ నెల 28న మధ్యాహ్నం 2.30కి ప్రత్యేక విమానంలో ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన వెంట రానున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. వీరందరూ అక్కణ్నుంచి హెలికాప్టర్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన మెట్రో రైల్ పైలాన్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు.
స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి.. అనంతరం మెట్రో రైలును ప్రారంభిస్తారు. అదే రైలులో మియా పూర్ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి మియాపూర్ చేరుకుంటారు. మొత్తం 15 నిమిషాల పాటు ప్రధాని రైలు ప్రయాణం కొనసాగుతుంది. ప్రధాని పర్యటన షెడ్యూల్‌లో మొత్తం 25 నిమిషాలను మెట్రో ప్రారంభోత్సవానికి కేటాయించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే మియాపూర్ నుంచి ప్రధాని, సీఎం హెలికాప్టర్‌లో బయల్దేరి సాయంత్రం 4 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకుని ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
సదస్సులో కేసీఆర్, అమెరికా పారిశ్రామికవేత్తల బృందానికి సారథ్యం వహిస్తున్న ఇవాంకా ట్రంప్ ప్రసంగాల అనంతరం మోదీ ప్రసంగిస్తారు. అక్కణ్నుంచి రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గంలో హెచ్‌ఐసీసీ నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. ఇవాంకా ట్రంప్‌తో పాటు ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు భారత ప్రభుత్వం తరఫున ఈ ప్యాలెస్‌లో విందుకు ఏర్పాట్లు చేశారు. రాత్రి 8.45 నుంచి 9.30 వరకు ఇవాంకాతోపాటు ప్రపంచ పారిశ్రామికవేత్తలతో ప్రధాని ఈ విందులో పాలుపంచుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.
మియాపూర్‌లో పలు దుకాణాల తొలగింపు
ప్రధాని రాక నేపథ్యంలో మియాపూర్ మెట్రో డిపో సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను జీహెచ్‌ఎంసీ సర్కిల్–21 సిబ్బంది తొలగించారు. మియాపూర్ డిపో సమీపంలో వినాయకుల విగ్రహాల తయారీ దుకాణాలు, ఫర్నిచర్ సెకండ్ సేల్, టీస్టాల్స్, హోటల్స్ నిర్వహించే చిన్న గుడిసెలను తొలగించారు. ఎస్పీజీ అధికారుల సూచనల మేరకు భద్రతా కారణాలరీత్యా దుకాణాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
మియాపూర్ ముస్తాబు..
మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వేదికైన మియాపూర్ డిపో అందంగా ముస్తాబవుతోంది. ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రోరైలును లాంఛనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా సన్నాహాలు చేస్తోంది. ప్రధాని రాక నేపథ్యంలో మియాపూర్ డిపో పరిసరాల్లో తీరొక్క మొక్కలు.. కార్పెట్ గ్రాస్‌తో హరిత వాతావరణం ఏర్పాటు చేయడంతోపాటు పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
డిపో సమీపంలో సుమారు పది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పార్కింగ్, ప్రజోపయోగ స్థలాల ఏర్పాటుతోపాటు.. చిన్నారులు గ్రామీణ క్రీడలు ఆడుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని హెలికాప్టర్‌ను నిలిపేందుకు మియాపూర్ డిపో లోపల ప్రత్యేకంగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. డిపో సమీపంలో ప్రధాని ఆవిష్కరించనున్న మెట్రో పైలాన్‌ను వడివడిగా సిద్ధం చేస్తున్నారు. కాగా, మెట్రో రైలు టికెట్ చార్జీలను నేడోరేపో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది
Comments
Please login to add a commentAdd a comment