ఓ ‘పెద్ద’ సారూ.. ఈ ‘చిన్న’ బుద్ధేమిటి..? | POCSO case file on head master in khammam | Sakshi
Sakshi News home page

ఓ ‘పెద్ద’ సారూ.. ఈ ‘చిన్న’ బుద్ధేమిటి..?

Published Sat, Aug 12 2017 2:21 PM | Last Updated on Mon, Sep 11 2017 11:55 PM

POCSO case file on head master in khammam

వయసు పెరిగితే.. బుద్ధి వికసిస్తుంది..!
హోదా పెద్దదైతే.. పెద్దరికం వస్తుంది..!!
సార్వత్రిక సత్యమిది..
కొన్ని సత్యాలు.. అప్పుడప్పుడూ అసత్యాలవుతాయి..
అతడి విషయంలోనూ అలాగే జరిగింది..
వయసు పెరిగినప్పటికీ.. బుద్ధి కుంచించుకుపోయింది..!
హోదా పెద్దదవడంతో.. పెద్దరికం మాయమైంది..!!



బోనకల్‌(మధిర) : చూడ్డానికి అతడొక ‘పెద్ద’ మనిషి. పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి్సన బాధ్యతాయుత వృత్తిలోగల ఉపాధ్యాయుడు. సాధారణ ఉపాధ్యాయుడు మాత్రమే కాదు.. తనలాంటి కొందరు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు నాయకత్వ స్థానంలోగల ప్రధానోపాధ్యాయుడు. పిల్లల భాషలో చెప్పాలంటే.. ఆయనొక ‘పెద్ద’ సారు! ఈ ‘పెద్ద’ సారుపై పోలీస్‌ స్టేషన్లో అరుదైన ఓ కేసు నమోదైంది.

ఎవరా ‘పెద్ద’ సారు? ఏమిటా కేసు..?
డి.రమణయ్య. ఈయనే ఆ ‘పెద్ద’ సారు. బోనకల్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆయనపై నమోదైంది ‘పోక్సో’ కేసు. ‘పోక్సో’ అంటే.. ‘ప్రొటెక్షన్ ఆఫ్‌ చిల్ర్డన్ ఫ్రం సెక్సువల్‌ అఫెన్స్’. ఇదొక చట్టం. లైంగిక నేరగాళ్ల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే ‘చుట్టం’. ‘అయితే..? ఈ కేసును ఆయనపై ఎందుకు పెట్టారు?’ అనే సందేహం మీకు రావచ్చు. మీరు మనసులో అనుకుంటున్నట్టుగానే.. ఆ ‘పెద్ద’ సారు.. చేయకూడని ‘పెద్ద’ తప్పే చేశాడు.

ఏం చేశాడంటే...
చదువుకుంటున్న పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో.. బడిలో ఉపాధ్యాయులు కూడా అంతే. వారిని అంత జాగ్రత్తగా, బాధ్యతగా చూసుకోవాలి. ఆ పిల్లలు బడిలో ఉన్నంతసేపు కంటికి రెప్పలా కాపాడాలి. విద్యాబుద్ధులు నేర్పాలి. కానీ, అక్కడి ప్రధానోపాధ్యాయుడు రమణయ్య.. ఇవన్నీ మర్చిపోయాడు. కంటి పాపే కాటేసేందుకు ప్రయత్నించింది. బుద్ధులు నేర్పించాలి్సందిపోయి.. తానే బుద్ధిహీనుడిగా మారాడు. ఎనిమిదవ తరగతి చదువుతున్న నలుగురు అమ్మాయిలపై కొన్ని రోజుల నుంచి అనుచితంగా ప్రవర్తించసాగాడు. కడుపు నొప్పి వస్తున్నదంటూ బిక్క మొహంతో తన వద్దకు వచ్చిన ఆ నలుగురిలో ఓ అమ్మాయితో తన గదిలో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. ఆ పాప అదే రోజున తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

చిందులేశాడు
మరుసటి రోజునే పాఠశాలకు వచ్చి నిలదీద్దామని ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దీనిని అతడు ముందే ఊహించాడేమో.! ‘అది’ జరిగిన మరుసటి రోజు నుంచి సిక్‌ లీవ్‌ పెట్టాడు. దాదాపుగా పది రోజుల తరువాత, శుక్రవారం విధులకు హాజరయ్యాడు. ఆ నలుగురు విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబీకులు కలిసి పాఠశాలకు వెళ్లారు. హెచ్‌ఎం రమణయ్యను నిలదీశారు. వారు ముందుగానే, ఎందుకైనా మంచిదనుకుని.. స్థానిక పత్రిక, ప్రసార మాధ్యమాల విలేకరులను కూడా తమ వెంట తీసుకెళ్లారు.

వీరందరినీ చూసిన ఆ ‘పెద్ద’ సారు.. కోపంతో ఊగిపోయాడు. తన అనుమతి లేకుండా ఎందుకు వచ్చారంటూ చిందులేశాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగలేదు. ఆయనే పోలీస్‌ స్టేషన్కు వెళ్లి, కొందరు ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకరులపై ఫిర్యాదు చేశాడు. పనిలో పనిగా రావినూతల పాఠశాల జూనియర్‌ అసిస్టెంట్‌ బాగం వేణుపై కూడా ఫిర్యాదు చేశాడు (ఎంఈఓ ఆదేశంతో ఓ పనిపై బోనకల్‌ పాఠశాలకు వచ్చిన ఇతడు.. హెచ్‌ఎం, తల్లిదండ్రుల మధ్య వాగ్వాదాన్ని తన సెల్‌ ఫోన్లో చిత్రీకరించాడన్నది రమణయ్య అభియోగం). బాలిక  తల్లిదండ్రులు, కుటుంబీకుల ఫిర్యాదుతో ఆ ‘పెద్ద’సారుపై పోలీసులు ‘పోక్సో’ కేసు పెట్టారు.

ఆ పిల్లల తల్లిదండ్రులు, కుటుంబీకులు తీవ్ర ఆగ్రహావేశంతో ఇలా ప్రశ్నిస్తున్నారు..బోనకల్‌ గ్రామస్తులు ముక్కున వేలేసుకుని, దుమ్మెత్తి పోస్తూ ఇలా నిలదీసి అడుగుతున్నారు... ఓ ‘పెద్ద’ సారూ.. ఈ ‘చిన్న’ బుద్ధేమిటి.?!

మమ్మల్ని కూడా వేధించాడు..!
రమణయ్య ప్రవర్తన గురించిన మరొక దిగ్భ్రాంతికరమైన విషయం కూడా వెలుగులోకొచి్చంది. పాఠశాలకు వెళ్లిన విలేకరులతో అక్కడి ఉపాధ్యాయినిలు కొందరు తమ మనోవేదన వెలిబుచ్చారు. ‘‘ఆయన ప్రవర్తనే అంత. పిల్లల్నే కాదు.. మమ్మల్ని కూడా వేధిస్తున్నాడు. మేం బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక, ధైర్యంగా ఎదిరించలేక, మౌనంగా భరించలేక.. మానసికంగా ఎంత నరక యాతన అనుభవిస్తున్నామో ఎలా చెప్పేది?’’ అని, కన్నీటిపర్యంతమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement