యథేచ్ఛగా పాల కల్తీ! | poisonous milk racket was caught in medak district | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా పాల కల్తీ!

Published Wed, Feb 14 2018 3:05 PM | Last Updated on Wed, Feb 14 2018 3:05 PM

poisonous milk racket was caught in medak district - Sakshi

కేంద్రంలోని పాల డబ్బాలు

తూప్రాన్‌: ప్యాకెట్‌ పాలైనా.. గేదె పాలైనా.. విష రసాయనాలు, ఎముకల పొడిమయమై పోయాయి. పాలల్లో పోషక పదార్థాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ ప్రస్తుతం పాలల్లో వాటికి బదులుగా ప్రజలను రోగాల బారిన పడేసే విషం ఉంటోంది. ఇదేంటి అనుకుంటున్నారా..?  ఇది నిజం.. జిల్లాలోని తూప్రాన్, కాళ్లకల్‌ మండల కేంద్రాలు పాల కల్తీకి అడ్డాగా మారాయి. పాల కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. దీంతో వ్యాపారులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. డివిజన్‌ పరిధిలోని తూప్రాన్, కాళ్లకల్‌ గ్రామాలను అడ్డాగా ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు సమాచారం. పట్టణానికి చెందిన ఓ పాల వ్యాపారి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తూప్రాన్‌ డివిజన్‌లోని రైతుల వద్ద ఉన్న గేదెలు, ఆవులు సుమారు 5 వేలకు పైగా ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ఇక్కడ నిత్యం సుమారు 50 వేల లీటర్ల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది.  తూప్రాన్‌కు చుట్టుపక్కల మండలాలైన శివ్వంపేట, Ðవెల్దుర్తి, వర్గల్, చేగుంట మండలాలు, కాళ్లకల్‌కు మేడ్చెల్‌ జిల్లాలోని పూడూరు, రావన్‌కోల్, సోమారం, ఘనపూర్, మేడ్చెల్, లింగాపూర్, డబీల్‌పుర తదితర గ్రామాల వ్యాపారులు అక్కడ సేకరించిన పాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
 
రహస్యంగా ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు..
జిల్లాలో సరఫరా అవుతున్న పాలల్లో దాదాపు 80 శాతం కల్తీ జరుగుతున్నట్లు పలువురు పాల వ్యాపారులు చెబుతున్నారు. ఒక లీటరు స్వచ్ఛమైన పాలను ఎనిమిది లీటర్ల కల్తీ పాలుగా మార్చుతున్నారు. దీని కోసం మొదట లీటరు పాలల్లో అత్యధికంగా నీళ్లు కలుపుతారు. ఆ తర్వాత ఇందులో యూరియా, ఎముకల పొడి, హైడ్రోజన్‌ ఫెరాక్సైడ్‌ వంటి రసాయనాలను తక్కువ మోతాదులో కలిపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాక కొందరు రైతులు అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు మోతాదుకు మించి ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు ఇవ్వడం పరిపాటిగా మారింది.

ఈ ఇంజక్షన్లు రంగారెడ్డి జిల్లా మేడ్చల్, బోయిన్‌పల్లిలోని జనరల్‌ వెటర్నరీ, పశువుల దాణా దుకాణాల్లో రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం. గతంలోనే ప్రభుత్వం ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ను నిషేధించింది. ఈ ఇంజక్షన్‌ వాడడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ అధిక పాల ఉత్పత్తి కోసం ఈ ఇంజక్షన్‌ను వాడుతున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

ఎక్కువ సేపు నిల్వ కోసం..
కల్తీ పాలను ఎక్కువ సేపు నిల్వ ఉంచడం కోసం హైడ్రోజన్‌ ఫెరాక్సైడ్, సోడియం బై కార్పొనేట్, క్యాల్షియం యాక్సైడ్, ఎముకల పొడి, ఇతర రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. పాలు తెల్లగా ఉండేందుకు లీట రుకు రెండు గ్రాముల చొప్పున యూరియాను కలుపుతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా సోయా, ఆముదం వాటి నుంచి వచ్చే నూనెలను కూడా కలుపుతున్నారు. అయితే అసలైన పాల వ్యాపారులు ఈ కల్తీ వ్యాపారుల వల్ల నష్టాలకు గురవుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి గేదెలను పెంచుతున్న రైతులు, వ్యాపారులు కల్తీ పాల పోటీకి తట్టుకోలేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు.

కల్తీ పాలతో వచ్చే వ్యాధులు..
కల్తీ పాల వల్ల చిన్న పిల్లలతోపాటు పెద్దవారు కూడా అనారోగ్యానికి గురవుతారు. వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్ట్రో, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కల్తీ పాలను నివారించాలని పలువురు కోరుతున్నారు. తూప్రాన్‌లో రెండేళ్ల క్రితం ఓ పాల వ్యాపారి కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి ఇంటిపై దాడి చేశారు. పాలల్లో కల్తీ గుట్టు రట్టు చేశారు. ఈ పాలల్లో యూరియా, నూనె, పౌడర్, తదితర రసాయనాలు గుర్తించి సదరు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. అయితే కొన్నాళ్లపాటు జాగ్రత్త పడిన వ్యాపారులు తిరిగి జోరుగా పాల కల్తీకి పాల్పడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు
మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. పాలు అమ్మేవారు రోజూ నాణ్యమైనవి అమ్మడం లేదు. పలుచని పాలు అమ్ముతున్నారు. కనీసం పెరుగు కూడా తోడు కోవడం లేదు. కల్తీ పాలు అమ్ముతున్నారు. ఎక్కడ కొనాలో తెలియక నిత్యం సతమతమవుతున్నాం. నాణ్యమైన పాలు అమ్మే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.    –మహ్మద్‌ అసీఫ్,

కల్తీ పాలతో ఇబ్బందులు తప్పడం లేదు
వ్యాపారులు కల్తీ పాలను అమ్మడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తూప్రాన్‌లో కృత్రిమ పాల తయారుదారుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అదే తరహాలో పాలల్లో కల్తీ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. తనిఖీ అధికారులు పాలల్లో కల్తీని గుర్తించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి.
–చెలిమెల జయరాములు, తూప్రాన్

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

రైతులు పెంచుతున్నపాడి గేదెలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement