బస్సుయాత్ర ప్రారంభోత్సవంలో కోదండరాం, విమలక్క, హరగోపాల్, రామయ్య తదితరులు
వర్సిటీల ప్రైవేటీకరణ దారుణం: కోదండరాం
• విద్యా పోరాట బస్సు యాత్ర ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన విద్య అందజేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాం డ్ చేశారు. సోమవారం గన్‌పార్కు వద్ద తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో జరిగిన విద్యా పోరాట బస్సు యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణ బిల్లు ఉన్నత విద్యారంగానికి గొడ్డలి పెట్టు వంటిదని కోదండరాం అన్నారు. రెండు దశాబ్దాలుగా వర్సిటీల్లో నియామకాల్లేవన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యవస్థను నియంత్రించ కుంటే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అసాధ్యమన్నారు.
పాలకవ ర్గాలు ప్రసార మాధ్యమాలను గుప్పిట్లో ఉంచుకుని తమ అభిప్రాయాలను, నిర్ణయా లను ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయ త్నం చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. విద్యా పోరాట యాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుం దని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ప్రకటిం చారు. కాగా, ఈ బస్సు యాత్ర ఈ నెల 20 వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. సోమవారం సాయంత్రం ఉస్మానియా వర్సిటీకి చేరుకున్న బస్సుయా త్రకు ఓయూ విద్యార్ధులు, వివిధ సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు.
సమాన విద్య కోసం పోరాడుదాం: ప్రొఫెసర్ హరగోపాల్
పేద, ధనిక తేడా లేకుండ అందరికీ సమాన విద్య కోసం కలసి పోరాడాలని ప్రొఫెసర్ హరగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హమీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వర్సిటీలకు అనుమతినివ్వకుండా ప్రభుత్వ వర్సిటీలను బలోపేతంచేయాలని పేర్కొన్నారు. అంతకుముందు గన్‌పార్కు వద్ద హరగోపాల్ మాట్లాడుతూ.. విద్యాలయాలను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం దుర్మార్గమైన రిలయన్స్ సంస్థకు విశ్వవిద్యాలయాలను అప్పగిస్తామని చెప్పడం దారుణమన్నారు.
ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, మానవీయ తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యకు రూ.10 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించడం సిగ్గు చేటన్నారు. కనీసం 20 శాతం నిధులు కూడా కేటాయించకుంటే ఎలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధర్, కార్యనిర్వాహక కార్యదర్శి కె.లక్ష్మీ నారాయణ, ఏఐఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్షుడు రహమాన్, ప్రొ.పద్మజాషా, ప్రొ.రత్నం, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆర్‌ఎల్ మూర్తి, పీడీఎస్‌యూ నాయకులు రంజిత్, నాగేశ్వర్‌రావు, డీఎస్‌యూ బద్రీ, నాయకులు అరుణాంక్ తదితరులు పాల్గొన్నారు.