2014 అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొట్ట తొలి ఎన్నికలు ఇవి. అలాగే, ఓ ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఎలక్షన్లు కూడా ఇవే. స్వరాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసింది. కారు వేగానికి రాజకీయ ఉద్దండులెందరో ఓడిపోయారు. సీనియర్ నేతలు డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి తదితరులు పరాజయం మూటగట్టుకున్నారు.
బాన్సువాడ.. ఐదోసారి పోచారం
బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. 2009, 2011, 2014 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గంలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండోæ ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. 1967, 1972, 78 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం.శ్రీనివాస్‌రావు హ్యాట్రిక్ సాధించిన తొలి ఎమ్మెల్యే కాగా, రెండో ఎమ్మెల్యే పోచారం. నియోజకవర్గంలో మొత్తం 1,79,416 మంది ఓటర్లు ఉండగా, 1,38,854 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాసుల బాల్‌రాజ్, టీడీపీ తరఫున బద్యానాయక్ రాథోడ్‌లు బరిలో నిలిచారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 65,868 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కాసుల బాల్‌రాజ్‌కు 41,938 ఓట్లు, బద్యానాయక్ రాథోడ్‌కు 19,692 ఓట్లు వచ్చాయి. 1313 ఓట్లు నోటాకు నమోదయ్యాయి. 23,930 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పోచారం.. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ పోచారం మరోమారు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి 65,868
కాసుల బాల్‌రాజ్ 41,938
మెజారిటీ 23,930
హ్యాట్రిక్ కొట్టిన ఏనుగు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏనుగు రవీందర్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లమడు గు సురేందర్, బీజేపీ నుంచి బాణాల లక్ష్మా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిద్ధార్థరెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థులుగా భట్టి నాగభూషణం, చిట్యాల సాయన్న పోటీ చేశా రు. ఏనుగు రవీందర్‌రెడ్డికి 70,760 ఓట్లు, నల్లమడుగు సురేందర్‌కు 46,751 బాణాల లక్ష్మారెడ్డికి 33,359 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాం గ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్‌పై 24,009 ఓ ట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఏనుగు రవీందర్‌రెడ్డి 2009, 2010, 2014 వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు.
ఏనుగు రవీందర్‌రెడ్డి 70,760
నల్లమడుగు సురేందర్ 46,751
మెజారిటీ 24,009
రూరల్.. బాజిరెడ్డి
డిచ్‌పల్లి: 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్ నుంచి డాక్టర్ భూపతిరెడ్డికి టికెట్ ఖాయమని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. అయితే, చివరి నిమిషంలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ సీఎం కేసీఆర్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటికే, ఎన్నికల ప్రచారంలో మునిగిన భూపతిరెడ్డి హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. 2004లో కేశ్‌పల్లి గంగారెడ్డి కారణంగా ఎమ్మెల్యే టికెట్ దూరమైందని, ఇప్పుడు మరోసారి తనను కాదని బాజిరెడ్డికి ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో అసంతృప్తి వీడిన భూపతిరెడ్డి ఎన్నికల్లో బాజిరెడ్డికి సహకరించారు. ఆ ఎన్నికల్లో బాజిరెడ్డికి 78,107 ఓట్లు రాగా, డీఎస్‌కు 51,560 ఓట్లు పోలయ్యాయి. 26,547 ఓట్ల మెజారిటీతో బాజిరెడ్డి విజయం సాధించారు. తర్వాతి కాలంలో బాజిరెడ్డికి, భూపతిరెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భూపతిరెడ్డి ఇటీవల రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ టికెట్ సంపాదించి బాజిరెడ్డిపై పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
బాజిరెడ్డి గోవర్ధన్ 78,107
డి.శ్రీనివాస్ 51,560
మెజారిటీ 26,547
బాల్కొండలో భారీ మెజారిటీ
మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన టీఆర్‌ఎస్‌కు 2014 ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. ‘ప్రత్యేక’ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చిన ఓటర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్‌రెడ్డికి 69,145 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఈరవత్రి అనిల్‌కు 32,897 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోనే 36,248 ఓట్ల భారీ మెజారిటీతో ప్రశాంత్‌రెడ్డి ఘన విజయం సాధించారు. నియోజకవర్గం ఆవిర్బవించిన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీ రావడం ప్రశాంత్‌రెడ్డికే దక్కింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటి సారి. ఈరవత్రి అనిల్ రెండో సారి పోటీ చేశారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేశారు. ఆయనకు కూడా ఇవే తొలి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి, ఓటమి పాలైన మల్లికార్జున్‌రెడ్డిలు బావ, బావమరిది కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ప్రశాంత్‌రెడ్డి రికార్డు సృష్టించారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ప్రశాంత్‌రెడ్డికి పేరుంది. ఈ క్రమంలోనే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి లభించింది. ఆయనకు నామినేటెడ్ పోస్టును కట్టబెట్టినా కేబినేట్ హోదా కల్పించి మంత్రిమండలి సమావేశాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం మరో విశేషం. తాజా ఎన్నికల్లోనూ బాల్కొండ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రశాంత్‌రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ప్రశాంత్‌రెడ్డి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ప్రశాంత్‌రెడ్డి 69,145
ఈరవత్రి అనిల్ 32,897
మెజారిటీ 36,248
సింధే.. రెండోసారి
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటా పడేవి. అయితే, 2014లో తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ జెండా ఎగురవేసింది. సెంటిమెంట్ కలిసి రావడంతో కారు జోరుకు ‘సైకిల్’ పంక్చర్ పడింది. కాంగ్రెస్ పార్టీ పరాజయం మూటగట్టుకుంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా హన్మంత్ సింధే బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం పోటీ చేశారు. హన్మంత్ సింధేకు 72,901 ఓట్లు రాగా, గంగారాంకు 37,394 ఓట్లు వచ్చాయి. 35,501 ఓట్ల మెజారిటీతో సింధే ఘన విజయం సాదించారు. జుక్కల్ నియోజకవర్గ చరిత్రలో తెలుగుదేశం పార్టీ తరఫున మొదటిసారి, టీఆర్‌ఎస్ తరఫున రెండోసారి అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా సింధే రికార్డు సృష్టించాడు.
హన్మంత్ సింధే 72,901
గంగారాం 37,394
మెజారిటీ 35,501
బోధన్.. మహ్మద్ షకీల్
బోధన్: 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ విజయం సాధించారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన షకీల్‌కు 67,427 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి 51,543, టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి 26,558 ఓట్లు వచ్చాయి. 15,884 ఓట్ల మెజారిటీతో షకీల్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బహుముఖ పోరు నెలకొన్నా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగింది. బోధన్‌లోని ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన షకీల్ 2001 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2008లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ çచేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన మహా కూటమి తరఫున టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన షకీల్.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి చేతిలో అతి స్వల్ప (1,275) ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో జరిగిన ఎన్నికల్లో షకీల్.. సుదర్శన్‌రెడ్డిని ఓడించి పైచేయి సాధించారు. రానున్న ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
మహ్మద్ షకీల్ 67,427
సుదర్శన్‌రెడ్డి 51,543
మెజారిటీ 15,884
కామారెడ్డి.. గంప గోవర్ధన్
కామారెడ్డి క్రైం: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఉద్యమ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చేరిన గంప గోవర్ధన్‌కే నియోజకవర్గ ప్రజలు వరుసగా నాలుగో సారి పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన గంపకు ఈ ఎన్నికల్లో 71,961 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్‌అలీకి 63,278 ఓట్లు వచ్చాయి. 6,683 ఓట్ల మెజారిటీతో గంప గోవర్ధన్ విజయం సాధించారు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆయన ప్రభుత్వ విప్ అయ్యారు. అసెంబ్లీ రద్దు వరకు ఆయన ప్రభుత్వ విప్‌గా కొనసాగారు.
గంప గోవర్ధన్ 71,961
షబ్బీర్ అలీ 63,278
మెజారిటీ 8,683
అర్బన్‌లో.. టీఆర్‌ఎస్ పాగా
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ తొలిసారిగా పాగా వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటుకుంది. టీఆర్‌ఎస్ తరఫున బిగాల గణేష్‌గుప్తా, కాంగ్రెస్ నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంఐఎం తరపున మీర్‌మజాజ్‌అలీ, బీజేపీ అభ్యర్థిగా ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గణేశ్ గుప్తాకు 42,148 ఓట్లు రాగా, అనూహ్యంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థి మీర్‌మజాజ్‌అలీకి 31,840 ఓట్లు సాధించి రెండో స్థానం నిలిచారు. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 10,308 ఓట్ల మెజారిటీతో గణేష్‌గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు.
గంప గోవర్ధన్ 71,961
షబ్బీర్ అలీ 63,278
మెజారిటీ 8,683
ఆర్మూర్‌లో.. జీవన్‌రెడ్డి
ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై 13,964 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జీవన్‌రెడ్డికి 67,555 ఓట్లు రాగా, సురేష్‌ర్డెకి 53,591 పోలయ్యాయి. న్యాయవాదిగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటూ వచ్చారు. 2008లో ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్నల గిట్టుబాటు ధర గురించి తలెత్తిన వివాదంలో రైతుల తరఫున అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, మంచి గుర్తింపు పొందారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. వేల్పూర్ మండలం జాన్కంపేట గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి కుటుంబం ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో స్థిరపడింది. 2014 ఎన్నికల్లో కేసీఆర్ టీఆర్‌ఎస్ తరఫున మొట్టమొదటి టికెట్‌ను జీవన్‌రెడ్డికే కేటాయించారు. అప్పటి ఎ న్నికల్లో ఘన విజయం సాధించిన జీవన్‌రెడ్డి.. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
జీవన్‌రెడ్డి 67,555
సురేశ్‌రెడ్డి 53,591
మెజారిటీ 13,964
Comments
Please login to add a commentAdd a comment