రాజకీయాలకే వన్నెతెచ్చిన అక్కిరాజు​​ వాసుదేవరావు​​​​​​​​​​​ | Politician Akkiraju Vasudeva Rao Ruling In Kodada | Sakshi
Sakshi News home page

రాజకీయాలకే వన్నెతెచ్చిన అక్కిరాజు వాసుదేవరావు​​​​​​​​​​​

Published Thu, Nov 15 2018 10:46 AM | Last Updated on Thu, Nov 15 2018 10:53 AM

Politician Akkiraju Vasudeva Rao Ruling In Kodada - Sakshi

అప్పటి రాష్ట్రపతి వీవీగిరి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆయనతో అక్కిరాజు వాసుదేవరావు

సాక్షి,కోదాడ అర్బన్‌ : ఎంతో చైతన్యం కల్గిన హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన  అక్కిరాజు వాసుదేవారావు నాటి రాజకీయాలకే వన్నె తెచ్చారు. ప్రజలకిచ్చి వాగ్దానాలను నెరవెర్చడంలో ఆయన సఫలీకృతులయ్యారు. 1962 నుం చి1972 మరకు వరకు రెండు సార్లు కాంగ్సెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికై బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహా రావుల కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అనంతరం 1977 కోదాడ నియోజకవర్గం ఏర్పడిన అనంతరం ఆయన 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు.1978కు ముందు కాంగ్రెస్‌ ఉన్న ఆయనను ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి పరిశీలనలో ఉన్నదని, ఆయన సమకాలికులు చెబుతున్నారు. 
స్వచ్ఛందంగా..
1983 వరకు కోదాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అదే సంవత్సరంలో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఆయనకు టికెట్‌ ఇచ్చినప్పటికీ స్థానిక పరిస్థితలను అవగతం చేసుకుని, పెరిగిన ఎన్నికల వ్యయం, వర్గవిభేదాలు, కులప్రాతిపతికన ఓట్లు చీలడంతో పోటీనుంచి తప్పుకున్నారు. తన శిష్యుడైన చింతాచంద్రారెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఇప్పించారు. నేటి రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టికెట్ల కోసం తన్నుకుంటున్న ఈ స్థితిలో ఆయనకు వచ్చిన టికెట్‌ను స్యచ్ఛందంగా వదులుకుని సమకాలిన రాజకీయాలకే వన్నె తెచ్చారు. ఈ నిర్ణయాన్ని కోదాడ ఎన్నికల బహిరంగ సభకు వచ్చిన మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ స్యయంగా బహిరంగ వేదిక పైనుంచే అభినందించారు. 
విద్యాప్రదాతగా..
హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల్లో పోటీచేసిన సందర్భములో ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు కోదాడలో డిగ్రీ కళాశాలను ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ విభాగంతో  ఏర్పాటు చేయించారు. తొలుత కోదాడ బాలుర ఉన్నతపాఠశాలలో ఈ కళాశాలను ప్రారంభించారు. అనంతరం తన బంధువులైన కొండపల్లి రాఘవమ్మరంగారవు నుంచి 60ఎకరాల భూమిని విరాళంగా సేకరించి 1970లో  కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు ఫౌండర్‌ చైర్మన్‌గా ఆయన కొనసాగారు. అదే విధంగా ఆయన కళాశాల అభివృద్ధికి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేశారు. అప్పట్లోనే విదేశాల్లో ఎంబీఏ చదివిన మాజీమంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణరావును కళాశాల కరస్పాండెంట్‌గా చేశారు.    ఈ కళాశాల ద్వారా ఎందరో విద్యార్ధులు ఉన్నత చదువులు చదివి, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ కళాశాలకు, కళాశాల విద్యార్థులకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది.


నాటి ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం బ్రహ్మానందరెడ్డితో.. 
వంద గ్రామాలకు ఒకే సారి విద్యుత్‌ 
నియోజకవర్గ పరిధిలో వంద గ్రామాలకు ఒకే సారి విద్యుత్‌ సౌకర్యం కల్పించిన ఘనత కూడా ఆయనకు ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు. అప్పటి వరకు కిరోసిన్‌ దీపాలతో ఉండే గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి, వీధి దీపాలను ఏర్పాటు చేయించారు.  
రహదారులు, వైద్యానికి పెద్దపీట
నియోజకవర్గంలో రహదారులను ఏర్పాటు చేయడంలో ఆయన కృషిచేశారు. కనీస రహదారి లేని గ్రామాలకు మార్కెట్‌ కమిటీ ద్వారా రైతులకు రహదారి సౌకర్యాలు కల్పించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ద్వారా హుజూర్‌నగర్, కోదాడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అనేక గ్రామాలను కలుపుతూ రోడ్లు వేయించారు. స్వతహాగా ఆర్‌ఎంపీ వైద్యుడైన ఆయన నియోజకవర్గంలో వైద్యానికి కూడా పెద్దపీట వేశారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలలో వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషిచేశారు.


గఫార్‌ఖాన్‌ ప్రసంగాన్ని ట్రాన్స్‌లేట్‌ చేస్తున్న అక్కిరాజు 
సాగర్‌ కాలువల ఏర్పాటులో కూడా ప్రత్యేకతే..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయన హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాలకు సాగర్‌నీటిని తీసుకొచ్చేందుకు చేసిన కృషి ఇప్పటికీ ఆయా ప్రాంతాల ప్ర జలు కొనియాడుతారు. పీవీ నర్సింహారావు మంత్రి వ ర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆ యన అప్పటి కాలువల ఏర్పాటులో  ఎంతో కృషిచేశారు.
జాతీయ నాయకులతో సత్సంబంధాలు
రాజకీయంగా ఆయన రాష్టంలో మంచి గుర్తింపు తెచ్చుకుని జాతీయ నాయకులతో మంచి సత్సంబంధాలను కొనసాగించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోదాడకు వచ్చిన సందర్భముగా ఆయనను అభినందించి సెంట్రల్‌లో మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. అనంతరం ఆమె హత్యకు గురికావడంతో రాజకీయ ప్రస్థానానికి ఇబ్బంది ఏర్పడింది. పీవి నర్సింహారావుకు బంధువు, అత్యంత ఆత్మీయుడు అయన వాసుదేవరావుకు మారుతున్న రాజకీయ పరిణామాలతో రాజకీయ జీవితానికి విఘాతం కల్గింది. ఆప్కాబ్‌ చైర్మన్, ఖాధీ భాగ్యనగర సమితి చైర్మన్‌ ఆయన కొనసాగారు. జాతీయ స్థాయిలో ఆయనకు మణిశంకర్‌ అయ్యర్‌ తదితర ఆనాటి నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. రాష్ట్రంలో అప్పటి పెద్దతరం నాయకులు, సినిమా పరంగా ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సి నారాయణరెడ్డి, దాశరథిలతో మంచి సంబంధాలను కొనసాగించారు.

ఆంగ్లంలో అనర్గళవక్తగా 
అక్కిరాజు వాసుదేవరావుది హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న మేళ్లచెర్వు శివారు వెంకట్రాపపురం. ఆయన కుటుంబం భూస్వామ్య కుటుంబం కావడంతో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఆయనను ఆయన తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలో చదివించారు. అక్కడ ఆయన ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదవి అంగ్లంలో మంచి పట్టు సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో అసెంబ్లీలో పలు సమస్యలపై ఆంగ్లలో మాట్లాడుతుంటే సభ ఆసాంతం ఆలకించేదని పాత తరం నాయకులు తెలిపే వారు. ఆంగ్లంలో మంచి పట్టు సాధించడంతో జాతీయ స్థాయిలో కూడా ఆయన మంచి గుర్తింపు వచ్చిం ది. రాష్ట్రానికి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా వారి ప్రసంగాలను ఆయన తర్జుమా చేసే వారని తెలిపారు.  


   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement