అక్కడ...ఇక్కడ
- నగరంతో పాటు స్వగ్రామాల్లోనూ వివరాల నమోదు
- జీహెచ్‌ఎంసీకి స్వయంగా వెళ్తున్న జనం
- సర్వేలో గందరగోళం
సాక్షి, సిటీబ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజే (19వ తేదీన) జరుగుతుందని తెలిపిన అధికారులు దాన్ని ఇంకా కొనసాగిస్తుండటంతో జిల్లాల్లో పేర్లు నమోదు చేయించుకునేందుకు వెళ్లినవారు.. ఇక్కడ కూడా తిరిగి నమోదు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఒక్కరోజు మాత్రమే సర్వే జరుగుతుందని ప్రకటించినప్పటికీ.. ప్రజల ఫిర్యాదుల మేరకు వారందరి వివరాలు నమోదు చేస్తామన్న యంత్రాంగం గురువారం వరకూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది.
కొన్ని సర్కిళ్లలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు ప్రజలే ఫారాలను స్వయంగా ఇచ్చారు. ఈలోగా జిల్లాల్లో తమ పేర్లు నమోదు చేయించి వచ్చిన వారు తిరిగి ఇక్కడ కూడా నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజా సమాచారం మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటి వరకు 20,57,121 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. ఇంకా 71,083 కుటుంబా లు ఉన్నట్లుగా అంచనా. వీటితో పాటు ఇంకా తమ దృష్టికి రాకుండా మిగిలిపోయిన వారి వివరాలు కోసం మరో రోజు సర్వే జరపాలనేది అధికారుల యోచన.
గందరగోళంగా టెండర్లు
సమగ్ర సర్వే వివరాల కంప్యూటరీకరణకు జీహెచ్‌ఎంసీ పిలిచిన టెండర్ల ప్రీ బిడ్ సమావేశం సందర్భంగా శుక్రవారం తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. బిడ్స్ స్వీకరణ సమయానికి సంబంధించి పత్రికల్లో ప్రకటనకు, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోని ప్రకటనకు తేడా ఉండటంతో తాము దాఖలు చేయలేకపోయామని పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళన సాగుతుండగానే సాంకేతిక బిడ్‌ల కార్యక్రమాన్ని అధికారులు పూర్తిచేశారు.
ఆర్థిక బిడ్ల ఆమోదం అనంతరం సంబంధిత సంస్థకు పనులు అప్పగించనున్నారు. మొత్తం ఆరు టెండర్లు రాగా, అందులో మూడు ఒకే సంస్థవి ఉన్నాయి. వీటిలో ఐదు సాంకేతిక అర్హత పొందాయి. శనివారం ఆర్థిక బిడ్‌లు ఆమోదం పొందితే.. సోమవారం నుంచి ప్రాజెక్టు పనులు మొదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు పనుల ప్రాధాన్యం దృష్ట్యా స్టాండింగ్ కమిటీ ఆమోదానికి వేచి చూడకుండా ఉండేందుకు పనులను విభజించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సర్టిఫికె ట్లు ఇవ్వాలి: విద్యార్థుల డిమాండ్
సమగ్ర కుటుంబ సర్వేలో సహాయ ఎన్యూమరేటర్లుగా పని చేసిన కొన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు తమకు జీహెచ్‌ఎంసీ నుంచి ధ్రువపత్రాలు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. సమగ్ర సర్వేలో పాల్గొన్న వారికి జీహెచ్‌ఎంసీ నుంచి ప్రశంసా పత్రాలు అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. పారితోషికం కంటే వీటి వల్ల తగిన గుర్తింపు లభిస్తుందనే తాము విధులు నిర్వహించామని వారు చెబుతున్నారు. హామీ మేరకు తమకు సర్టిఫికెట్లు అందజేయాల్సిందిగా పలువురు విద్యార్థులు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
పొరపాట్లు సవరించాలి
సమగ్ర సర్వేలో భాగంగా సేకరించిన వివరాలు సరైనవేనంటూ ఎన్యూమరేటర్లు సంతకాలు చేయాల్సి ఉంది. సహాయ ఎన్యూమరేటర్లుగా వివిధ కళాశాలల విద్యార్థులు, ఇతరత్రా విభాగాల వారు సర్వే ఫారాలను పూరించారు. అలాంటి వాటిలో పూర్తి వివరాలు నమోదు కాలేదని.. కొన్నింట్లో పొరపాట్లు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము పూర్తి చేయని వాటికి బాధ్యులుగా సంతకాలు చేయలేమని కొందరు ఎన్యూమరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు విభాగం నుంచి ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహించిన వారి నుంచి ఈ అభ్యంతరాలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు నింపడంలో పొరపాట్లు దొర్లితే తగిన ధ్రువీకరణలు చూపిన వారి వివరాలు సవరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.