ఆస్తిపన్ను రాయితీలో గందరగోళం
సర్వేలో వెల్లడవుతున్న వైనం
సగానికి పైగా అనర్హులే..!
సిటీబ్యూరో: చిన్న నివాసాల వారికి ఆస్తిపన్నులో ఇచ్చిన మినహాయింపు జీహెచ్‌ఎంసీలో గందరగోళంగా మారింది. ఇంతవరకు రూ. 1200 లోపు ఆస్తిపన్ను ఉన్నవారు రూ. 101 చెల్లిస్తే చాలని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన నాటికి జీహెచ్‌ఎంసీలో రాయితీ పరిధిలోకి వచ్చేవారు 5.09 లక్షల మంది ఉండగా, అనంతరం 5.42 లక్షలకు పెరిగారు. ఈ ఇళ్లను తాజాగా సర్వే చేస్తుండగా, ఇందులో సగంమంది అసలు పథకానికి అర్హులే కారని తేలింది. ఇదే అవకాశంగా బిల్ కలెక్టర్లు ఇళ్ల యజమానులతో లాలూచీ పడి జేబులు నింపుకునే పనిలో పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కథా కమామిషు ఇలా.. ప్రభుత్వం ఆస్తిపన్ను రాయితీ నిచ్చిన నేపధ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు రూ. 1200 లోపు పన్ను ఉన్న ఇళ్లపై తాజాగా సర్వే చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను రాయితీని అమల్లోకి తెచ్చిన గత ఏడాది డిసెంబర్ 31 నాటికి వీరి సంఖ్య 5,09,187 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 5,42,990కి పెరిగింది. అప్పడు ఆస్తిపన్ను జాబితాలో లేనివారిని జాబితాలో చేర్చడం ద్వారా ఈ సంఖ్య పెరిగి ఉండవచ్చు. తాజాగా 35 వేల ఇళ్లను తనిఖీ చేయగా.. అందులో సగానికి పైగా.. అసలు ఆస్తిపన్ను రాయితీకి అర్హులు కారని తేలింది.
జీహెచ్‌ఎంసీ జాబితాలో వారు చెల్లించాల్సిన ఆస్తిపన్ను రూ. 1200 లోపునే ఉన్నప్పటికీ, వాస్తవంగా ఇప్పుడు జరిపిన క్షేత్రస్థాయి తనిఖీతో వీరు చెల్లించాల్సిన పన్ను రూ. 2 వేల నుంచి లక్ష రూపాయల దాకా కూడా ఉండటం గమనార్హం. గతంలో గ్రౌండ్‌ఫ్లోర్ ఉన్నప్పుడు నిర్ధరించిన ధరలనే నేటికీ చెల్లిస్తూ మూడు, నాలుగు అదనపు అంతస్తులు నిర్మించినా వాటిని ఆస్తిపన్ను జాబితాలో చూపకపోవడం వంటి కారణాలతో వారు రాయితీకి అనర్హులని గుర్తించారు. తిరిగి 35 వేల ఇళ్లను సర్వే చేయగా, అందులో 16 వేల ఆస్తులు మినహాయింపు పరిధిలో లేవని తేలింది. వీటి ద్వారా దాదాపు రూ. 8 కోట్లు జీహెచ్‌ఎంసీకి అదనంగా రావాల్సి ఉందని గుర్తించారు. ఆదాయం పెరగనుందని జీహెచ్‌ఎంసీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మినహాయింపు ఇచ్చినట్లే ఇచ్చి భారీ మొత్తం భారం మోపుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే అదనుగా కొందరు బిల్ కలెక్టర్లు రాయితీ పరిధిలోనే మీ ఇళ్లను ఉంచుతామని ఇళ్ల యజమానులతో ఒప్పందం చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి.
విచిత్రం..
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివరాలు ఒకలా ఉండగా, సర్కిళ్ల అధికారుల వద్ద మరో రకమైన వివరాలు ఉండడం సందేహాలకు తావిస్తోంది. ఉదాహరణకు ఓ సర్కిల్‌కు సంబంధించి ప్రధాన కార్యాలయంలో దాదాపు 40 వేల ఇళ్లు మినహాయింపు జాబితాలో ఉండగా.. ఆ సర్కిల్ కార్యాలయంలో ఆ సంఖ్య 25 వేలుగా ఉంది. ఆన్‌లైన్‌లో ఎవరికి వారు ఇష్టానుసారం ఈ జాబితాను మారుస్తున్నారని, ఇందులో భారీ స్కామ్‌కు ఆస్కారం ఉన్నట్టు అనుమానాలున్నాయి. అధికారులు ఈ అంశంపై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి.