
మాయామశ్చీంద్ర బడ్జెట్: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవ దూరంగా ఉందని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది అంకెల గారడీతో కూడిన మాయామశ్చీంద్ర బడ్జెట్‌లా.. ఊహలు, అంచనాల బడ్జెట్‌లా ఉందని ఎద్దేవా చేశారు. బడ్జెట్ విషయంలో వాస్తవ పరిస్థితిలోకి సర్కారు దిగిరావాలని, ఫీల్‌గుడ్ వ్యవహారంతో సినిమా చూపొద్దన్నారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చను పొంగులేటి ప్రారంభించారు. రాష్ట్రంలో 1,586 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌ఆర్‌సీబీ గణాంకాలు చెబుతున్నాయని.. రైతు స్వరాజ్య వేదిక నివేదిక ప్రకారం 2,709 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని స్పష్టమైందన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ తీసుకురావాలని, ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. పన్నుపోటు లేని బడ్జెట్ ప్రవేశపెట్టామంటున్న సర్కారు, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యత్ చార్జీలు పెంచొద్దన్నారు. అక్షరాస్యతలో బిహార్ కంటే రాష్ట్రం వెనుకబడి ఉండటం శోచనీయమని పొంగులేటి అన్నారు. ధర్నాచౌక్‌ను తరలించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.