రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదు: ఈటెల
హైదరాబాద్: సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ శాసన సభలో తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు చాలా గర్వంగా ఉందని సాక్షి టెలివిజన్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఈటెల తెలిపారు.
అవమానాలు, అసమానతల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన అన్నారు. అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉండాల్సిన రెండు రాష్ట్రాల మధ్య కక్ష సాధింపు కనిపిస్తోందని ఈటెల అభిప్రాయపడ్డారు.
రైతుల ఆత్మహత్యలు అతిభయకంరమైనవని, రైతులు ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదని ఆయన అన్నారు. పరిహారం ప్రకటించినంత మాత్రాన రైతులకు న్యాయం జరగదన్నారు. టీడీపీ, బీజేపీ బంధం వలన కేంద్రాన్ని అనుమానించాల్సి వస్తుందన్నారు. ఆంధ్రా పార్టీల విమర్శల్ని, ఆరోపణల్ని తాము పట్టించుకోమని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.