
'మోదీని తిట్టొద్దని కేసీఆర్ అడ్డుకున్నారు'
జీఎస్టీపై కేసీఆర్ ఇప్పుడెందుకు మాటమార్చారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: జీఎస్టీ వల్ల రాష్ట్రానికి లాభం వస్తుందని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టొద్దని మద్ధతు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడెందుకు మాటమార్చారని తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీపై కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతున్నదే ఇప్పుడు జరుగుతోందన్నారు. మధ్యతరగతి, సామాన్య ప్రజలను పట్టించుకోకుండా జీఎస్టీని రూపొందించారని విమర్శించారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత పన్నును జీఎస్టీ ద్వారా మనదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై మోపుతోందని పొంగులేటి విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెప్పుకోసం అందరికంటే ముందుగా జీఎస్టీకి సీఎం కేసీఆర్ మద్ధతును ఇచ్చారు. జీఎస్టీ వల్ల నష్టం జరుగుతుందని అసెంబ్లీలో, శాసనమండలిలో మాట్లాడుతుంటే ప్రధానమంత్రి మోదీని తిట్టొద్దని సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని పొంగులేటి గుర్తుచేశారు. ఇప్పుడు వాస్తవంలో వచ్చే సరికి భారంపడుతున్నదని, దీనితో జీఎస్టీ పన్నుపోటు తెలిసి వస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్‌ది అవకాశవాదమని, అంశాలవారీ మద్దతు అంటూ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.