కరెంటెప్పుడత్తదో.. | power cuts in karimnagar rurals | Sakshi
Sakshi News home page

కరెంటెప్పుడత్తదో..

Published Fri, Aug 22 2014 2:33 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

కరెంటెప్పుడత్తదో.. - Sakshi

కరెంటెప్పుడత్తదో..

మంత్రికీ కరెంటు తిప్పలు
మంత్రి కేటీఆర్ గురువారం గంభీరావుపేట మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనగా రెండున్నర గంటల సమయంలో ఆరుసార్లు కరెంట్ వచ్చిపోయింది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన అర్జీలను మంత్రి సెల్‌ఫోన్ టార్చిలైట్ల వెలుతురులో ఇలా పరిశీలించారు.

ఇక రోజూ ఎదురుసూసుడే   
మిలియన్ యూనిట్ల కొరత
జిల్లాలో పెరిగిన కరెంటు కోత   
పల్లెల్లో పొద్దంతా సరఫరా బంద్
ఎండుతున్న పంటలతో రైతుల ఆందోళన
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరెంటు కోత వణుకు పుట్టిస్తోంది. పల్లెల్లో పట్టపగలు చీకట్లు కమ్ముకుంటున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో పగటిపూట విద్యుత్‌పై ఆధారపడి జీవనం సాగించే చిన్న వ్యాపారాలు, దుకాణాలన్నీ మూతపడ్డాయి. వర్షాభావ పరిస్థితులు.. ఎండాకాలంలా మండుతున్న వాతావరణానికి తోడుగా మితిమీరిన కరెంటు కోతలు అన్నదాతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కోతలు తప్పవని సర్కారు పదేపదే చెబుతున్నప్పటికీ ఖరీఫ్ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

దిక్కుతోచక విద్యుత్ సిబ్బందిపై తమ ఆగ్రహాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. కరెంటు కోతలకు నిరసనగా గురువారం కమలాపూర్ మండలం ఉప్పల్‌లో రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్భంధించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.  కరెంటు కోతలు ఎత్తివేయాలని, తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ మండలంలోని వెంకట్రాంపల్లి గ్రామ రైతులు  చెక్కపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మెట్‌పల్లి మండలంలోని వెంకట్రావుపేటలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

రోజురోజుకు ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అవసరానికి తగినంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో కోతలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రోజుకు మొత్తం 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 11 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. ఉత్పత్తిలో కొరత కారణంగా ప్రస్తుత వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు విద్యుత్ కోతలు తప్పవని ఆ శాఖ ఎస్‌ఈ నారాయణ అభిప్రాయపడ్డారు. గృహావసరాల కంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని తమకు ఆదేశాలున్నాయని.. అందుకే విద్యుత్ సరఫరా వేళలు ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.

గురువారం నుంచి అన్ని కేటగిరీలకు కరెంటు కోత సమయాన్ని పెంచారు. జిల్లా కేంద్రంలో రోజుకు ఏడు గంటల పాటు కోత విధిస్తున్నారు. ఉదయం 5 నుంచి 8 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మున్సిపాలిటీలు, మండలకేంద్రా లు, సబ్‌స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో 9 గంటల కోతను అమలుచేస్తున్నారు. ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొద్దంతా కరెంటు ఉండడం లేదు.

దీంతో పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు భరించలేని ఉక్కపోత మరోవైపు విద్యుత్ కోతతో జనం నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారికంగా వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్న సర్కారు... లోటు విద్యుత్‌ను సర్దుబాటు చేసేందుకు అనధికారికంగా కోతలు విధిస్తోంది. అన్ని జిల్లాల్లో వ్యవసాయానికి నాలుగు అయిదు గంటలకు మించి సరఫరా చేయటం లేదు. లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్‌శాఖ రైతులతో చెలగాటమాడుతోంది. ఇచ్చే కాసింత వ్యవధిలోనూ తరచూ ట్రిఫ్ అవడం, లోవోల్టేజీనే.

చీటికి మాటికి కరెంటు వచ్చి పోతుండటంతోపాటు లోవోల్టేజీతో ట్రాన్స్‌ఫార్మర్లు, పంపుసెట్లు, మోటార్లు  కాలిపోతున్నాయి. దీంతో రైతులకు అదనపు భారం తప్పటం లేదు. జిల్లాలో గత నెలలో సగటున రోజుకు 30 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. మరోవైపు నిర్ణీత వేళాపాళాలు లేకపోవటం రైతుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, అర్ధరాత్రి వేళల్లో సరఫరా చేయడంతో రాత్రంతా పొలం వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ చీకట్లో వ్యవసాయ బావుల వద్దకు వెళుతున్న రైతులు విషపురుగుల బారిన పడి ప్రమాదాలకు గురవుతున్నారు. తెగిపడిన విద్యుత్ లైన్లు, ప్యూజులు తగిలి షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 16 మంది రైతులు విద్యుత్ షాక్‌తో చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement