
జిల్లా ప్రజల గొంతు కోశారు
► ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు
► రీడిజైన్‌తో అన్యాయం
► టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌యాదవ్
బెజ్జూర్ : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్‌తో జిల్లా ప్రజల గొంతు కోశారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. శుక్రవారం మండంలోని తలా యి గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల నీరు జిల్లాకు కేటాయించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. రీడిజైన్ కారణంగా రూ.కోట్ల ప్రజాధనంవృథాపోతుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ప్రాణహిత చేవెళ్ల, అంబేద్కర్ సృజల స్రవంతిని తీసుకవచ్చిన గణత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. తలాపునే ప్రాణహిత నీరున్నా తలాయి గ్రామానికి నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
అక్కడి గ్రామస్తులు కిలో మీటర్ల దూరం నుంచి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కమీషన్ల కోసమే ప్రాణహితను కాళేశ్వరానికి మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు, గజ్జి రామయ్య మాట్లాడారు. తాము ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుంటే టీఆర్‌ఎస్ నాయకులు గ్రామాల్లో తిరగనివ్వబోమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాయకులు శ్రీవర్ధన్, వసంతరావు, కోండ్ర బ్రహ్మయ్య, విలాస్‌గౌడ్, తదితరులున్నారు.