ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి
కొత్తగూడెం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలలుగన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కోరనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారన్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అంశాల వారీగా పార్లమెంట్‌లో ప్రస్తావించనున్నట్లు తెలి పారు. ఇటీవల విషజ్వరాలతో అనేకమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు.
రాష్ట్ర విభజనకు పూర్వం ముంపు మండలాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఓటు వేశారని, ఇప్పుడు వారి సమస్యలను ప్రస్తావించేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముంపు మండలాల ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానన్నారు. బంగారు తెలంగాణ తెస్తామని అనేక హామీలు గుమ్మరించిన కేసీఆర్ ఇప్పుడు ఆ హామీలను విస్మరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల అధికారుల కొరత ఉందని, అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించడం విడ్డూరం అన్నారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రబీలో వరి సాగు చేయవద్దని ప్రకటించిన కేసీఆర్ జూన్ 2వ తేదీనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఖరీఫ్ సాగు వద్దని రైతులను కోరితే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యతోపాటు ప్రస్తుతం నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారానే పత్తి కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని పొంగులేటి పేర్కొన్నారు. పత్తి క్వింటాలుకు రూ.4,050 చొప్పున కొనుగోలు చేయాలని కోరతామన్నారు.