సిద్ధాంతి ప్రతాప్
సాక్షి, సిటీబ్యూరో: ‘కానిస్టేబుల్ అంటే పెళ్లి కావట్లేదు’ అంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలనం సృష్టించిన చార్మినార్ ఠాణా కానిస్టేబుల్ సిద్ధాంతి ప్రతాప్ గురువారం విధులు నిర్వర్తించారు. అతడి రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందకపోవడంతో సామూహిక నిమజ్జనం డ్యూటీలో భాగంగా చార్మినార్ వద్ద విధులు నిర్వర్తించారు. ఆసక్తితో డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చినప్పటికీ అనివార్య కారణాల నేపథ్యంలో తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రతాప్ నగర పోలీసు కమిషనర్‌కు ఆంగ్లలో రాసిన లేఖను శనివారం బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ఇన్‌వార్డ్ సెక్షన్‌లో ఇచ్చిన విషయం విదితమే.
బుధవారం వెలుగులోకి వచ్చిన ఆ అంశం పోలీసు విభాగంలో కలకలం సృష్టించింది. పలువురు కానిస్టేబుల్ స్థాయి అధికారులు దీనిని సోషల్‌మీడియాలో షేర్ చేశారు. పదోన్నతుల విషయంలో తామూ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామంటూ కామెంట్స్ పెట్టారు. దీంతో ప్రతాప్ రాజీనామా వ్యవహారం హల్‌చల్ చేసింది. ఈయన రాజీనామాపై పోలీసు విభాగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చార్మినార్ ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న అతడికి బందోబస్తులో భాగంగా చార్మినార్ వద్దే డ్యూటీ వేశారు. ప్రతాప్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా... తన రాజీనామాపై పునరాలోచన చేస్తానంటూ చెప్పారు.
చదవండి :కానిస్టేబుల్ అంటే పెళ్లి కావట్లేదు
Comments
Please login to add a commentAdd a comment