నులిపురుగులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పిల్లల్లో నులి పురుగుల నిర్మూలనకు సమయం ఆసన్నమైంది. ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందజేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేస్తారు.
జిల్లావ్యాప్తంగా ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 8.30 లక్షల మంది ఉన్నారు. వీరికి ఆల్బెండజోల్ మాత్రలే వేసేందుకు మొత్తం 4,516 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 10వ తేదీన మాత్రలు వేసుకోకుండా మిగిలిపోయిన వారికి ఈనెల 17వ తేదీన మరోసారి వేస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ పవార్ తెలిపారు. ఇవే కేంద్రాల్లో మాత్రలు వేస్తారని పేర్కొన్నారు. నిర్దిష్ట వయసు గల పిల్లలందరికీ మాత్రలు వేయించాలని ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించామన్నారు.
రక్తహీనత.. బలహీనత
ముఖ్యంగా 19 ఏళ్లలోపు పిల్లలపై నులి పురుగులు, ఏలికపాములు, కొంకి పురుగుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి సంక్రమిస్తే పిల్లల్లో రక్తహీనతకు గురవుతారు. పోషకాహార లోపం కనిపిస్తుంది. కడుపునొప్పి బాధతోపాటు శరీరం బలహీనతగా అనిపిస్తుంది. ఆందోళనకు గురవుతున్నారు. క్రమంగా బరువు కూడా తగ్గుతారు. ఏకాగ్రత లోపిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. తదితర లక్షణాలు కనిపిస్తే సదరు పిల్లలకు నులి పురుగులు సంక్రమించినట్లుగా భావించాలని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వీటిని నివారించవచ్చు. కలుషిత ఆహారం తీసుకోవడం, బహిరంగ మల విసర్జన, చేతులు సరిగ్గా కడగకపోవడం తదితర వాటి వల్ల నులి పురుగులు అధికంగా సంక్రమిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment