
వానర సంకటం
గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు.. పట్టణ, నగర ప్రాంత వాసులను ముప్పుతిప్పలు పెడుతున్న కోతుల అంశాన్ని రాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది.
- వానరాల నియంత్రణపై దృష్టిపెట్టిన సర్కారు
- గ్రామాల నుంచి రాజధానిదాకా కోతుల బెడద
- పండ్లు, కూరగాయల సాగుకు రైతుల వెనుకంజ
- బెంబేలెత్తుతున్న మహిళలు, పిల్లలు, వృద్ధులు
- సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే యోచన
- 18 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అటవీశాఖ
గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు.. పట్టణ, నగర ప్రాంత వాసులను ముప్పుతిప్పలు పెడుతున్న కోతుల అంశాన్ని రాష్ట్ర సర్కారు సీరియస్‌గా తీసుకుంది. వాటి బెడదను నివారించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించింది. కోతులు జనావాసాల్లోకి రాకుండా ఉండేలా హిమాచల్‌ప్రదేశ్‌లో అమలుచేస్తున్న విధానాన్ని అనుసరించాలని దీనిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జంతువులుగా ఉన్న కోతులను నియంత్రించడం కోసం వాటికి పునరుత్పత్తి నియంత్రణ (వేసెక్టమీ) ఆపరేషన్లు చేయడమే పరిష్కార మార్గమని స్పష్టం చేసింది.
- సాక్షి, హైదరాబాద్
రూ. 18 కోట్ల వ్యయం..!
కోతులకు ఆపరేషన్లు చేయడానికి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఒక్కో కేంద్రానికి రూ. 2.77 కోట్లు ఖర్చవుతుందని, ఐదు కేంద్రాలకు రూ. 13.87 కోట్లు కావాలని కోరింది. ఈ కేంద్రాల నిర్వహణ కోసం ఏటా రూ. 4.13 కోట్లు కావాలని పేర్కొంది. మొత్తంగా ఈ కేంద్రాల ఏర్పాటు, మొదటి ఏడాది నిర్వహణ కోసం రూ. 18 కోట్లు అవసరమని అటవీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఒక్కో కేంద్రంలో రోజుకు 200 కోతులకు ఆపరేషన్లు చేసేందుకు వీలుంటుంది. ఆపరేషన్లు చేయడం, కోతులు కోలుకునే దాకా ఆహారం ఇవ్వడం, తిరిగి అడవుల్లో విడిచిపెట్టి, అక్కడ కూడా వాటికి అవసరమైన ఆహారాన్ని అందించడం కోసం అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనివల్ల కోతుల సంఖ్య పెరగడాన్ని నియంత్రించవచ్చని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. మరోవైపు అడవుల్లోనూ కోతులకు ఆహారంగా ఉపయోగపడే పండ్ల చెట్లను పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది.
రాజధానిలోనూ..
కోతుల నియంత్రణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఒకటుంది. ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని మంత్రుల క్వార్టర్స్‌ను కోతుల మంద చుట్టుముట్టింది. అక్కడికి వచ్చిన సందర్శకుల మీద దాడులు చేశాయి. వాటిని తరిమేయడానికి భద్రతా సిబ్బంది పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ దృశ్యం పలువురు మంత్రుల కంట్లోనూ పడింది. ఇప్పటికీ అడపాదడపా కోతులు అక్కడకు రావడం, నివాస సముదాయాల్లోకి వెళ్లడం జరుగుతూనే ఉంది. దీనికితోడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కోతుల తాకిడి ఎక్కువైంది. ఇళ్లపై తిరగడం, కాలనీల్లో పిల్లలపై దాడి చేయడం పెరిగింది. దీంతో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ కోతుల బెడదను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు సహా పలు విద్యాసంస్థల పరిధిలోనూ కోతుల బెడద అధికమైంది. దీంతో ప్రభుత్వం ఈ సమస్య నివారణపై దృష్టి సారించింది. ఇక ‘స్కూల్‌కు పోవాలంటే కోతులు కరుస్తాయని భయమవుతోంది..’ అని ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా ఒక విద్యార్థి సీఎం కేసీఆర్‌తో చెప్పడం కూడా దీనికి కారణం.
ఎందుకీ పరిస్థితి
అడవుల్లో ఆహారం లభించకపోవడంతోనే కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.‘‘పదేళ్ల కిందట నల్లమల అడవుల్లో 40 వేల వరకు కోతులు ఉండేవి. రాను రాను అక్కడ వాటి సంఖ్య బాగా తగ్గింది. అవన్నీ అడవులు వదిలి జనావాసాల దగ్గరిలోకి వచ్చాయి. అడవుల్లో ఆహారం, నీళ్లు దొరకకపోవడంతో పంట పొలాలపై పడుతున్నాయి. ఇళ్లలోకీ చొరబడుతున్నాయి..’’ అని వారు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని చంపాపేట్ ప్రాంతంలో ఓ వ్యక్తి కోతుల గుంపును చెదరగొట్టడానికి భవంతి పైకి ఎక్కి, జారిపడి మరణించాడని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో దారుణం
కొంత కాలంగా కోతులు వందల సంఖ్యలో గుంపులుగా గ్రామాలపై పడుతున్నాయి. తోటల్లో పండ్లు, పొలాల్లో కూరగాయలు, పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇక ఇళ్లలోకి వచ్చి కోతులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. వండిన వంటల దగ్గరి నుంచి సామగ్రి అంతా పాడుచేస్తున్నాయి. పండ్ల చెట్లు, పూల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. వాటిని అదిలించాలని చూస్తే.. దాడి చేస్తున్నాయి. ఇలా వందలాది మంది కోతుల కారణంగా గాయపడుతున్నారు.