
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ మొదలవుతోంది. సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఈసారి హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు దాదాపుగా 30 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్తారని అంచనా. తెలంగాణ నుంచి సంక్రాంతి, దసరా సమయాల్లో రద్దీ అధి కంగా ఉంటుంది. అందులోనూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా ప్రజలు సంక్రాంతికి తప్పకుండా స్వగ్రామాలకు వెళ్తారు. నగరం విస్తరిస్తోన్న దరిమిలా వీరి సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. దీంతో సొంతూళ్లకు వెళ్లడం ఓ ప్రహసనంగా మారింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా సంస్థలే కీలకం. అయితే.. పండుగల సమయంలో ఉండే రద్దీని నియంత్రిం చడం సాధ్యంకాకపోవడంతో.. ఈ వ్యవస్థలు అదనపు చార్జీల రూపంలో ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇది సామాన్యుడిని ఆవేదనకు గురిచేస్తోంది. రైలు, బస్సుల టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పండుగపూట సొంతూరికి వెళ్లే భాగ్యం తమకు లేదా? అని వాపోతున్నాడు.
‘పంచాయతీ’ నేపథ్యంలో..
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఊరికి రావాలంటూ పిలుపులు వస్తున్నందున.. ఈసారి తెలంగాణ పల్లెలకూ ప్రయాణికులు పోటెత్తుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండటంతో సహజంగానే రద్దీ ఉంటుంది. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొన్నటి దసరా సమయంలోనూ తెలంగాణ జిల్లాలకు ప్రజలు పోటెత్తారు. 50% అదనపు చార్జీలు చెల్లించి బస్సుల్లో వేలాడుతూ మరీ వెళ్లారు. ఒక్క నగరం నుంచే దాదాపుగా 10 లక్షల మందికిపైగా తెలంగాణ ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో సంక్రాంతి ప్రత్యేకం
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలు సంక్రాంతికి తప్పకుండా వెళతారు. ఇలాంటి వెళ్లే వారి సంఖ్య దాదాపు 20 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. దీంతో ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు, రైళ్లపై అపుడే చర్చ మొదలైంది. ముందస్తుగా రైళ్లల్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి అదనపు ఛార్జీలు గండం తప్పినా.. అలాంటివారు చాలా తక్కువ. ఏపీ నుంచి వచ్చి నగరంలో స్ధిరపడిన వారిలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్, ఇతర ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి ముందస్తుగా సెలవులు వచ్చే అవకాశం తక్కువ. ఇలాంటి వారంతా జనవరి 7 తర్వాత ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. కాగా ఎప్పటిలాగే.. రైల్వే, ఆర్టీసీలు టికెట్లపై అదనపు ఛార్జీల పేరిట బాదుడుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే అదనపుగా ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.300 ఉండే టికెట్ ఛార్జీని రూ.3000 వరకు పెంచేస్తున్నాయి. వీరి చార్జీల పెంపునకు ఒక విధానమంటూ లేకపోవడంతో ఒకే గమ్యస్థానానికి రకరకాల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో నలుగురు సభ్యులున్న కుటుంబ ప్రయాణమంటే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది.
ప్రజారవాణానే కీలకం
జనవరి మొదటివారం నుంచే సంక్రాంతి రద్దీ మొదలవుతుంది. ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ 2వ తేదీన ప్రకటించనుంది. దాదాపు 4,500 బస్సులను తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు నడపొచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జనవరి 7 నుంచే రద్దీ ఊపందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ కూడా హైదరాబాద్‌కు 1000 బస్సుల వరకు నడపనుంది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల ద్వారా దాదాపుగా 20 లక్షలకు పైగా ప్రయాణం చేస్తారని అంచనా. సాధారణంగా తెలంగాణ, ఆంధ్రకు కలిపి రోజుకు 40 రైళ్లలో రాకపోకలు జరుగుతాయి. వీటిలో రోజుకు 56వేల మంది ప్రయాణిస్తారు. పండగ వేళ రోజుకు 3 ప్రత్యేక రైళ్లు తోడవడంతో ఈ సంఖ్య 60 వేలు దాట నుంది. 7వ తేదీ నుంచి 13 వరకు దాదాపు 4.5 లక్షల మంది రైళ్ల ద్వారా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి.
ప్రైవేటు దందా..
ఇవి కాకుండా తెలంగాణ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో దాదాపు 7,800కు పైగా వివిధ కంపెనీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. వీటిలో ఛార్జీల గురించి తెలుసుకుంటేనే భయమేస్తోంది. సాధారణ రోజుల్లో రూ.300–500 రూపాయలుండే టికెట్‌ను తత్కాల్, ఇతర ఛార్జీల రూపంలో రూ.2,500 నుంచి 3,000 వరకు పెంచేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏకంగా ఒక్కో టికెట్‌కు రూ.4000కుపైగా వసూలు చేస్తున్నాయి. వీటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ట్రావెన్స్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రైవేటు ఆపరేట్ల బస్సుల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు సొంతూళ్లకు వెళ్లనున్నారు. ఇక సొంత వాహనాల ద్వారా రెండు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లేవారు 1–2 లక్షల మంది ఉంటారని అంచనా.
ఏ మార్గాల ద్వారా ఎంతమంది?
రెండు ఆర్టీసీలు: 20 లక్షల మందికిపైగా
రైలు మార్గాలు: సుమారు 5 లక్షలు
ప్రైవేటు బస్సులు: దాదాపుగా 5లక్షల మంది
సొంత, ఇతర వాహనాలు: సుమారుగా 2 లక్షలు
మొత్తం : దాదాపు 30–35 లక్షలకుపైగా ప్రయాణం చేయనున్నారు.
రైలు ఛార్జీలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు..
రైలు చార్జీల పెంపు వ్యవహారం కేంద్రమంత్రి వరకూ వెళ్లినట్లు సమాచారం. నగరానికి చెందిన జాతీయపార్టీ నేతలు అధిక ఛార్జీలపై పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు దీనిపై మంత్రికి నివేదిక కూడా ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం 9 ప్రత్యేక రైళ్లే వేసామని, పూర్తిస్థాయిలో రైళ్లు వేయలేదని, త్వరలోనే మరిన్ని రైళ్లు వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సంక్రాంతి సీజన్‌లో ఈ రైళ్లన్ని తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయని అందుకే ఎక్కువ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామని గోయల్‌కు వివరించారు.
త్వరలోనే జనసాధారణ్ రైళ్లు
సామాన్యుల కోసం త్వరలోనే జనసాధారణ్ పేరుతో రైళ్లను వేయనున్నట్లు తెలిపారు. 14–15 జనరల్ బోగీలతో ఉండే ఈ రైళ్లలో సాధారణ చార్జీలే ఉండనున్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment