బుధవారం ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డి
నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వాహనాలను నియంత్రించండి
ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులకు మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పర్మిట్లు, అనుమతులతో సంబంధం లేకుండా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతూ ఆర్టీసీ ఆదాయానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేటు వాహనాలను వెంటనే నియంత్రించాలని ఆదేశించింది. ఓవైపు ఆదాయానికి గండికొడుతూనే మరోవైపు ఓవర్ లోడ్‌తో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నందున ఆ వాహనాల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది.
సీఎం ఆదేశం మేరకు రవా ణామంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం ఆర్టీసీ, రవాణా అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయం బస్‌భవన్‌లో జరిగిన భేటీలో రవాణా ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్, ఆర్టీసీ జేఎండీ రమణరావు, జేటీలు, ఈడీలు పాల్గొన్నారు. ప్రైవేటు వాహనాల ఆగడాలను నియంత్రించాలంటే నిర్దిష్టంగా ఏం చేయాలన్న సూచనలేవీ సమావేశంలో చర్చకు రాకపోవటం గమనార్హం. ముఖ్యంగా రవాణా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.
439 మార్గాల్లో అక్రమ రవాణా
తెలంగాణలో 3,597 మార్గాలుంటే వాటిల్లో 439 రూట్లలో ప్రైవేటు వాహనాలు అక్రమంగా తిరుగుతున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చా రు. వీటివల్ల ఆర్టీసీ ఏటా దాదాపు రూ.400 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతోందని పేర్కొన్నారు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోందన్నారు. దీంతో మంత్రి వెంటనే వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, దీనిపై సీఎం పట్టుదల తో ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం, రవాణాశాఖ డీటీసీ స్థాయిలో ప్రతి మంగళవారం, ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్‌లు నెలలో ఒకసారి సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.
తాను ప్రతి మూడు నెలలకోమారు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు. ఇటీవల సీఎం మంజూరు చేసిన రూ.150 కోట్లతో కొత్త బస్సులు కొంటామన్నారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు 100 వరకు ఏసీ బస్సులు నడిచేలా చూస్తామన్నారు. ఖమ్మం, కరీంనగర్‌లకు 30 చొప్పున ఏసీ బస్సులు సమకూరుస్తామని పేర్కొన్నారు. చూపులకు అందంగా ఉండే రంగులతో కొత్త బస్సులు ఆకట్టుకుంటాయని, త్వరలో తెలంగాణ ఆర్టీసీకి కొత్త లోగో సిద్ధం చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లు శుభ్రంగా ఉండేలా చూడడంతోపాటు పరిసరాల్లో చెట్లు పెంచి ప్రయాణికులకు మంచినీటి వసతి మెరుగుపరచాలని ఆదేశించారు.
ఆర్టీసీని విభ జన జరగాలి: టీఎంయూ
తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి తదితరులు మంత్రిని కోరారు. ఆర్టీసీ వేతన సవరణ, ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్, డీఏ బకాయిల చెల్లింపు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఆర్టీసీని పరిరక్షించేందుకు ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రాజిరెడ్డి తదితరులు మంత్రిని కోరారు.