దోచుకున్నోడే దొర! | Progress in Do not The bank robbery cases | Sakshi
Sakshi News home page

దోచుకున్నోడే దొర!

Published Thu, Dec 25 2014 2:07 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

దోచుకున్నోడే దొర! - Sakshi

దోచుకున్నోడే దొర!

జిల్లాలో బ్యాంకు చోరీలు.. దారి దోపిడీ కేసులను ఛేదించడంలో పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారు. వరుస సంఘటనల్లో లక్షలాది రూపాయలు.. కిలోలకొద్ది బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనా.. ఇప్పటికీ ఏ ఒక్క నిందితుడినీ గుర్తించలేకపోయారు. ఇక్కడ చోరీ చేసిన వారు ఇతర జిల్లాల పోలీసులకు చిక్కడం.. మన పోలీసుల సమర్థతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఫలితంగా ‘దోచుకున్నోడే.. దొర’ అనే చందం గా మారింది. అసలు ఎందుకిలా జరుగుతోంది.. మన పోలీసుల్లో సత్తా లేదా..? అని సగటు మనిషి మదిని తొలుస్తున్న ప్రశ్న.       - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
 
* పురోగతి లేని బ్యాంకు చోరీ కేసులు
* ఒక్కరినీ పట్టుకోలేకపోయిన జిల్లా పోలీసులు
* డిపార్ట్‌మెంట్ పనితీరుపై ప్రజల్లో అనుమానం

వరంగల్ జిల్లా భూపాల్‌పల్లి గ్రామీణ వికాస బ్యాంకులో జరిగిన దోపిడీని అక్కడి పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. కరీంనగర్ జిల్లా కాటారంలో దొంగను పట్టుకుని కోర్టు బోనులో నిలబెట్టారు. చోరీకి గురైన సొత్తును బ్యాంకుకు అప్పగించారు. మరి మన జిల్లా పోలీసులకు ఏమైంది..? దొంగలు తెగబడి బ్యాంకు దోపిడీలు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్..గ్రామీణ వికాస బ్యాంకు.. కెనరా బ్యాంకు.. ఇలా ఒక్కొక్కటి లూటీ చేశారు.

తాజాగా ఝరాసంగం సిండికేట్  బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేశారు. అయినా మన పోలీసుల్లో చలనం లేదు. నెలలు గడుస్తున్నా దొంగల ఆచూకీ దొరకటం లేదు. ఎందుకీ నిర్లిప్తత?  వరంగల్ పోలీసులకున్న సత్తా మన వాళ్లలో లేదా? నేర పరిశోధనలో మన పోలీసులకు అంత సీన్ లేదా..? లేకుంటే జిల్లా పోలీసు బాసే.. ఇప్పుడో.. రేపో అన్నట్టు ఉండగా..! నాలుగు కాసులు వెనకేసుకోక ఈ  కేసుల గొడవలు ఎందుకు అనుకుంటున్నారా? అనేది సగటు మనిషి మదిని తొలుస్తున్న ప్రశ్నలు. ఒక్క బ్యాంకులే కాదు, ఇళ్ల మీద పడి దొంగలు స్వైర విహారం చేస్తున్నారు.
 
జహీరాబాద్ ప్రాంతంలో...
2014 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది.  రూ.13.45 లక్షల నగదుతో పాటు సుమారు 7 కిలోలకు పైగా బంగారం చోరీకి గురైంది. అయితే దుండగులను పట్టుకోవడంలో మన పోలీసులు చేతులెత్తేశారు. అదే దొంగలు హైదరాబాద్‌లో దొంగతనం చేస్తూ దొరికిపోయి అక్కడి పోలీసుల విచారణలో తామే ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.  
* సెప్టెంబర్ 9న జహీరాబాద్ పట్టణంలోని రఫీ జ్యూవెలర్స్ దుకాణంలో దొంగలు చొరబడి అర కిలో బంగారం, 20 కిలోల వెండిని దొంగిలించారు. వీరు ఇంకా దొరకలేదు.
* 2013 మార్చి 18న కొత్తూర్(బి) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరీకి పాల్పడి రూ.3.75 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మార్చి 28న కోహీర్ మండలం కవేలి గ్రామంలో గల సిండికేట్ బ్యాంకును దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సందర్భంగా దొంగలు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐ వెంకటేష్ గాయపడ్డాడు.
* వెల్దుర్తి మండలంలోని మాసాయిపేటలోని కెనరా బ్యాంకు దోపిడీ జరిగి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నేరస్తుల ఆచూకీ  తెలుసుకోలేకపోయారు. దొంగలు 5కిలోల బంగారు ఆభరణాలు, 15 లక్షల నగదును ఎత్తుకె ళ్లినా ఆ బ్యాంకు లూటీ అయ్యిందనే విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. దొంగలను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో బ్యాంకులో నగదు, నగలు దాచుకున్న వారి ఆందోళనకు గురవుతున్నారు.
* శివ్వంపేట మండలం గోమారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సంవత్సరం క్రితం దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామంలో అద్దె భవనంలో బ్యాంకు కొనసాగుతోంది. దొంగలు లోపలికి చొరబడి లాకర్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు దొంగలను గుర్తించలేదు.

అల్లాదుర్గం పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో నవంబర్ 3న దొంగలు చోరీకి యత్నించారు. బ్యాంకులో చొరబడి సీసీ కెమెరాను ఎత్తుకుపోయారు. కంప్యూటర్ మానిటర్‌ను ధ్వంసం చేశారు. దొంగలకు లాకర్ తెరుచుకోకపోవడంతో నగలు, నగదు చోరీ కాకున్నా.. బ్యాంకులోని వస్తువులు ధ్వంసం కావడంతో ఆస్తి నష్టం జరిగింది. పొలీసులు కేసు నమోదు చేసినా దొంగలను పట్టుకోలేదు. సీసీ కెమెరాలోని దొంగ ఫొటోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణను మాత్రం ముమ్మరం చేయలేదనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement