సాక్షి, మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముంపుబారినపడింది. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురికాకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్టనుంచి వరదనీరు లీకేజీ అయి ఆలయంలోకి చేరింది. ఆంజనేయస్వామి ఆలయంతో పాటు ధ్వజస్తంభాన్ని చుట్టుముట్టింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు. ఆలయంలోకి చేరిన నీటిని ధర్మకర్తలు,ఈఓ తెల్లవారేలోగా విద్యుత్ మోటార్లతో ఎత్తిపోసే పని చేపట్టారు.
ఆలయంలోకి చేరిన వరదనీరు
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పులిచింతల ప్రాజెక్ట్ ముంపునకు గురైంది. ఆలయం ముంపు బారిన పడకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్ట నుంచి బుధవారం వరదనీరు లీకేజీ కావడంతో ఆలయంలోకి చేరింది. దీంతో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన శ్రీస్వామివారి భక్తులు ఆలయానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంభూ స్వామివారిని ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కదిలించకుండా ఉండాలనే ప్రభుత్వం ఆలయంతో పాటు శివాలయం, అన్నదాన సత్రాల రక్షణకోసం ఆలయం చుట్టూ రూ.2కోట్లు, శివాలయం నుంచి ప్రహ్లాదఘాట్ వరకు రూ.4కోట్లు, అన్నదాన సత్రాలు, అతిథి గృహాల రక్షణ కోసం మరో రూ.6కోట్లు వెచ్చించి కరకట్టలు నిర్మించింది.
మూడు భాగాలుగా నిర్మించిన కరకట్టలో ప్రధానమైన ఆలయం చుట్టూ ఉన్న కరకట్ట (రక్షణగోడ)లీకేజీలు ఏర్పడి ఆలయంలోపలికి తెల్లవారుజాము నుంచి నీరు ప్రవేశించడంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. విషయం తెలుసుకున్న ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ ఉదయభాస్కర్‌లు తెల్లవారేలోపు ఆలయానికి చేరుకుని విద్యుత్‌మోటార్ సహాయంతో ఆలయంలోని నీరును బయటికి ఎత్తిపోసేపనిని ప్రారంభించారు. ఆ తరువాత కోదాడ ఆర్డీఓ కిశోర్‌కుమార్, ఎంపీపీ ముడావత్ కొండానాయక్, జెడ్పీటీసీ జగన్‌నాయక్, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ జానకిరాములు, సర్పంచ్ విజయలక్ష్మీవెంకటరమణ, ఈఓ ఉదయభాస్కర్‌లు ఆలయం వద్దకు చేరుకుని లీకేజీలను పరిశీలించారు. అప్పటికే వరదనీరు ఆంజనేయస్వామి ఆలయం, ధ్వజస్తంభం చుట్టుముట్టింది. ఇక్కడ కృష్ణమ్మ ప్రవాహాన్ని చూసి.. స్వామివారిని దర్శించుకునేందుకు మాత్రం భక్తులు భారీగా తరలివచ్చారు.
పులిచింతల ఎస్‌ఈతో ఆర్డీఓ సంప్రదింపులు..
మట్టపల్లి దేవాలయం కరకట్ట లీకేజీతో వరదనీరు చేరి ముంపుకు గురికావడంతో భక్తుల ఆందోళన గమనించిన కోదాడ ఆర్డీఓ కిశోర్‌కుమార్ ఆలయానికి చేరుకుని పరిశీలించారు. అక్కడి నుంచే పులిచింతల ప్రాజెక్ట్ ఎస్‌ఈతో ఫోన్‌లో సంప్రదించి కరకట్ట లీకేజీల విషయాన్ని వివరించారు. అయితే వెంటనే ఇంజనీర్‌లను పంపించి తక్షణ చర్యలు చేపడతామని ఎస్‌ఈ తెలిపినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేగాక మట్టపల్లిలో ముంపుకు గురవుతున్న మత్స్యకారుల నివాస ప్రాంతాలను చేపల రేవులను పరిశీలించారు. వరదముంపు పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులను ఆర్డీఓ ఆదేశించారు.
ఆలయాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ కిశోర్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment