సమగ్ర సర్వేపై అపోహలొద్దు
లింగాలఘణపురం : ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు కుట్రలు పన్ని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని, సర్వేపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య ప్రజలను కోరారు. సమగ్ర సర్వేపై గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులకు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ బోయిని శిరీష అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి సహకరించాలని కోరారు. రాష్ట్రాన్ని గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చేసే విధంగా ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి బంగారు తెలంగాణ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
సమావేశంలో ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ గోపాల్, సమగ్ర సర్వే ప్రత్యేక అధికారి రామకృష్ణారెడ్డి, తహశీల్దార్ సరిత, ఎంపీడీఓ రవి, ఎంపీటీసీలు భాగ్యమ్మ, లక్ష్మి, లావణ్య, కొమురమ్మ, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, శ్యాంప్రసాద్, మదార్, యాదగిరి, సోమన్న, మల్లారెడ్డి, లక్ష్మి, పద్మ, సత్తమ్మ, టీఆర్‌ఎస్ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు సంపత్, నాయకులు బోయిని రాజు, చిట్ల ఉపేందర్‌రెడ్డి, నాగేందర్, మనోహర్‌రెడ్డి, మహిళ నాయకురాలు భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
పార్టీ విధేయతకు కట్టుబడకుంటే ఉపేక్షించను
పార్టీ క్రమశిక్షణ, విధేయతకు కట్టుబడి ఉండకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం అన్నారు. సమగ్ర సర్వే అవగాహన సదస్సు అనంతరం ముఖ్య నాయకులతో మాట్లాడారు. పార్టీ వ్యవహారాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడాలని, పత్రికల్లోకి ఎక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్ ఆదేశానుసారమే ఇతర పార్టీల వారిని టీఆర్‌ఎస్‌లోనికి ఆహ్వానిస్తున్నామని అన్నారు. తెలంగాణ పునర్నిర్మానంలో అందరూ భాగస్వాములు కావాలనే లక్ష్యంతో పాటు ప్రతిపక్షమంటూ లేని విధంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా చెప్పారు.