
మోర్తాడ్ (బాల్కొండ): దివాళా పేరుతో దోహా ఖతర్‌లోని నఫల్ ఖతర్ కంపెనీ లాకౌట్ ప్రకటించి భారతీయ కార్మికులను నట్టేటా ముంచింది. కార్మికులకు నాలుగు నెలల వేతన బకాయిలను చెల్లించకుండా.. కనీసం ఇంటికి వెళ్లడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో మనవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నఫల్ ఖతర్ కంపెనీలో నిర్మాణ రంగానికి సంబంధించిన పనులు చేయడానికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన కార్మికులు ఐదేళ్ల నుంచి వెళ్లి వస్తున్నారు. అయితే, నష్టాలను సాకుగా చూపిన కంపెనీ యాజమాన్యం ఇటీవల లాకౌట్ ప్రకటించింది. కంపెనీ నిర్వహించే పనులను పూర్తిగా నిలిపి వేసినా కార్మికులకు సంబంధించిన క్యాంపులను మాత్రం కొనసాగిస్తోంది.
ఈ క్యాంపులో దాదాపు 100 మంది కార్మికులు ఉండగా అందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 20 మంది ఉండగా, అందులో 16 మంది కామారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. కంపెనీ క్యాంపులో ఉన్న కార్మికులకు క్యాంటీన్ సౌకర్యం ఉంటుంది. అయితే గతంలో భోజనం ఖర్చును కంపెనీ భరించేది. ఇప్పుడు లాకౌట్ ప్రకటించిన కారణంగా యాజమాన్యం భోజనం ఖర్చును కార్మికుల పైనే వేసింది. నాలుగు నెలల నుంచి వేతనాలు అందకపోవడంతో కార్మికులు అల్లాడిపోతున్నారు.
ఖతర్‌లో పని లేకపోవడంతో ఇంటికి రావడానికి కార్మికులు ఆసక్తి చూపుతున్నారు. అయితే వారి పాస్‌పోర్టులను తన ఆధీనంలో ఉంచుకున్న కంపెనీ యాజమాన్యం వాటిని ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. అంతేకాక కార్మికులు ఇంటికి వెళ్లడానికి అవసరమైన టిక్కెట్లను సమకూర్చే విషయంలోనూ ఆసక్తి చూపడం లేదు. వేతనాలు ఇవ్వకుండా, ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయకుండా, కనీసం రోజువారీ భోజనం విషయంలోనూ నిర్లక్ష్యం వహించడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నఫల్ ఖతర్ కంపెనీ యాజమాన్యంపై అక్కడి లేబర్ కోర్టులో, మన విదేశాంగ శాఖ కార్యాలయంలోనూ వారు ఫిర్యాదు చేశారు. కానీ ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధితులు గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి బసంత్‌రెడ్డికి తమ సమస్యను విన్నవించగా, ఆయన ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విదేశాంగ శాఖ అధికారులకు సమస్యను విన్నవించారు. విదేశాంగ శాఖ, ఎన్‌ఆర్‌ఐ సెల్ అధికారులు స్పందించి ఖతర్‌లోని తమ వారి సమస్యను పరిష్కరించాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ఎన్నో ప్రయత్నాలు చేశాం
నఫల్ ఖతర్ కంపెనీ తీరుతో విసి గిపోయాం. ఆ కంపెనీకి తగిన గుణపాఠం చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ యాజమాన్యం ఎంతకీ స్పం దించడం లేదు. కంపెనీ క్యాంపులో క్యాం టీన్ ఉన్నా, మా భోజనం మేమే కొనుక్కోవలసి వస్తుంది. గతంలో క్యాంటీన్ ఖర్చును కంపెనీ యాజమాన్యం భరించేది. ఇప్పుడు మొత్తం చేతులెత్తేసింది.
– దేవరాజ్ యాదవ్, జంగంపల్లి, కామారెడ్డి జిల్లా (ఖతర్‌లో కార్మికుడు)
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..
ఖతర్‌లోని కార్మికుల సమస్యను మంత్రి కేటీఆర్ ద్వారా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకవెళ్లాం. కంపెనీ యాజమాన్యంపై ఖతర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే, కార్మికులకు మొదట సమస్య పరిష్కారం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖతర్ నుంచి కార్మికులను రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – పాట్కూరి బసంత్‌రెడ్డి, గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment