పరీక్షలకే పరీక్ష
* ప్రశ్నపత్రాలెలా?
* టెన్త్‌కు పేపర్లు ఎన్ని?
* పరీక్ష విధానం మారిందా?
* తల పట్టుకుంటున్న టీచర్లు
* అయోమయంగా విద్యాశాఖ తీరు
త్రైమాసిక పరీక్షల నిర్వహణ జిల్లా విద్యాశాఖకు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెల 16 నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు (సమ్మెటివ్ అసెస్‌మెంట్ టెస్ట్) ప్రారంభమవుతాయని విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. కానీ, ఈ ప్రశ్నపత్రాలు ఎవరు తయారు చేస్తారు? అసలు పదో తరగతి విద్యార్థులకు ఎన్ని పేపర్లు ఉంటాయి? కొత్త విధానంలో పేపర్లు తయారు చేస్తారా? పాత పద్ధతిలోనే పరీక్షలుంటాయా? జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ప్రైవేటు పాఠశాలలకు ప్రశ్నపత్రాలు పంపిస్తుందా? సర్కారీ స్కూళ్లు ఎవరికి వారే పేపర్లు తయారు చేసుకోవాలా? ఈ వరుస సందేహాలు ఇటు ఉపాధ్యాయులను.. అటు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి వీటన్నింటిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవటంతో... ఈ సందేహాలు జిల్లా విద్యాశాఖను సైతం పట్టి పీడిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పరీక్షలన్నీ గతంలో డీసీఈబీ నిర్వహించేది. ముందుగానే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య వివరాలు తీసుకుని.. పరీక్ష ఫీజుగా కొంత రుసుము వసూలు చేసి ప్రశపత్రాలు పంపిణీ చేసేది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రావటంతో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఫీజు వసూలు నిషిద్ధంగా మారింది. దీంతో నిరుడే డీసీఈబీ చేతులెత్తేసింది. ప్రశ్నపత్రాలు తమరే తయారు చేసుకోవాలని సర్కారు పాఠశాలలను పురమాయించడంతో గందరగోళం తలెత్తుతుందని భావించిన ఆర్వీఎం స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఆ ఖర్చును విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఒక్కో విద్యార్థికి రూ.4 చొప్పున నిరుడు ప్రశ్నపత్రాలను డీసీఈబీనే తయారు చేసి పంపిణీ చేసింది. ఈ ఏడాది మళ్లీ అదే గందరగోళం పునరావృతమైంది. ఇప్పటికిప్పుడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైనా ప్రయోజనమేమీ ఉండదనే వాదన వినిపిస్తోంది. నిధులు విడుదల చేసినా ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణకు నెల పడుతుంది. అంటే సెప్టెంబరు 16 లోపు అందవు. 8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు మీరే తయారు చేసుకోవాలని ఇటీవలే డీసీఈబీ అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది.
ప్రైవేటు పాఠశాలలకు మాత్రం తాము సరఫరా చేస్తున్నట్లు అందులో పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు చెల్లించే ఫీజులకు ప్రశ్నాపత్రాల తయారీ తప్పనిసరి కావటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్కార్ స్కూళ్లలో చదివే విద్యార్థులను గాలికొదిలేసినట్లు విమర్శలు పెల్లుబికుతున్నాయి. టెన్త్ క్లాస్‌కు సంబంధించి విద్యాశాఖ నుంచి స్పష్ట త లేక ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు.