
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్ : బీసీ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికీ రుణాలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సీఎం కె.చంద్రశేఖర్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ సభల ద్వారా కొంతమందిని మాత్రమే ఎంపిక చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రకటించిన నేపథ్యంలో బీసీలంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
పైరవీల కోసం అధికార పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, ఎవరికి వారే తమకు రుణాలు కావాలని పోటీపడుతున్నారన్నారు. దీంతో ఈ పథకంలో అవినీతి అక్రమాలు జరిగే ప్రమాదముందని కృష్ణయ్య సీఎంకు విన్నవించారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలుంటే కేవలం 5.77 లక్షల దరఖాస్తులే వచ్చాయని, అందుకే దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు చేయాలని కోరారు.