'బీసీలపై బాబు, కేసీఆర్ నిర్లక్ష్యం' | R. Krishnaiah held dharna at jantarmantar | Sakshi
Sakshi News home page

'బీసీలపై బాబు, కేసీఆర్ నిర్లక్ష్యం'

Published Thu, May 7 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద జరిగిన ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తదితరులు

బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద జరిగిన ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తదితరులు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు బీసీలను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఇప్పటివరకు 29 సార్లు ఢిల్లీ వచ్చిన ఇరువురు ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో మూడు సార్లు భేటీ అయినప్పటికీ బీసీ బిల్లుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.

అఖిలపక్షాలతో ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాకుంటే బాబు, కేసీఆర్‌లకు బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఏపీ, తెలంగాణ అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసినా కేంద్రంపై తగిన ఒత్తిడి తేలేకపోతున్నారన్నారు. దేశవ్యాప్తంగా 542 మంది ఎంపీల్లో బీసీ ఎంపీలు 270 మందికిగాను 115 మంది మాత్రమే ఉన్నారన్నారు.

ఏపీలోని 25 మంది ఎంపీలకుగాను ముగ్గురు, తెలంగాణలో 17 మంది ఎంపీలకుగాను ఇద్దరు బీసీ ఎంపీలే ఉన్నారని వివరించారు. అస్సాంలోని బోడో, రాజస్థాన్‌లోని గుజ్జర్, శ్రీలంకలోని తమిళ ఈలం పోరాటాలను చూసి నేర్చుకోవాలని బీసీలకు పిలుపునిచ్చారు. నేను 25 ఏళ్ల యువకుడినైతే ఏకే 47 పట్టుకుని బీసీల కోసం పోరాడేవాడినని కృష్ణయ్య అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, రూ.50 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ప్రైవేటు రంగాల్లో రిజర్వేషను కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర పభుత్వాల్లో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మన్ రాజు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కెసన శంకర్‌రావు, తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతోపాటు కర్ణాటక, తమిళనాడు, యూపీ నుంచి బీసీ కార్యకర్తలు తరలివచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement