సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద ఏడాదికి గరిష్టంగా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి సాగునీరు అందదు. ఈ లెక్కన ఎకరా పంటకు నీటి సరఫరా కోసం ఏటా రూ. లక్షా 54 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి రుణాల చెల్లింపులు, విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ వ్యయాలు కలిపి ప్రాజెక్టుకు ఏటా రూ.17,876.7 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది’అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగితే ఈ వ్యయం రెట్టింపు అవుతందన్నారు.
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణకు లాభమా? నష్టమా?’అంశంపై ఆదివారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రఘు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే ఆధారమని నొక్కిచెబుతూనే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి ఈ ప్రాజెక్టులు పెనుభారమయ్యే ప్రమాదముందన్నారు. తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాజెక్టు పెట్టుబడి వ్యయంతో పాటు వార్షిక నిర్వహణ వ్యయ భారాలూ తగ్గించుకోవచ్చన్నారు.
డీపీఆర్ అశాస్త్రీయం: బిక్షం గుజ్జ
వ్యాప్కోస్ సంస్థ రూపొందించిన కాళేశ్వరం డీపీఆర్ అశాస్త్రీయంగా ఉందని అంతర్జాతీయ జల నిపుణుడు బిక్షం గుజ్జ మండిపడ్డారు. ఈ డీపీఆర్ లెక్కల ప్రకారమే ఎకరా సాగుకు ఏటా రూ. 42 వేల నిర్వహణ వ్యయం అవుతుందన్నారు. కాళేశ్వరం నిర్మిస్తే ఎకరా మిర్చి పంట సాగు ద్వారా రైతుల ఆదాయం రూ. 12 వేల నుంచి రూ. 1.56 లక్షలకు పెరుగుతుందంటూ అడ్డగోలు లెక్కలేశారని తప్పుబట్టారు.
ప్రభుత్వం తప్పించుకుంటోంది: కోదండరాం
ప్రాజెక్టుల వ్యయం తగ్గించుకోవాలని సూచిస్తున్న వారిని, రీ డిజైనింగ్‌లోని మార్పులను ప్రశ్నించిన వారిని ప్రాజెక్టుల వ్యతిరేకులని ముద్ర వేసి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వ ఇంజనీర్లు, నిపుణులకు బదులు కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల డిజైన్‌లు రూపొందించే దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అనవసర ప్రాజెక్టులు కట్టుకుంటూ తెలంగాణను ఉద్దరిస్తున్నామంటూ.. ఇంత తొందరగా అంత తొందరగా అవుతున్నాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.
సీఎం వాదన తప్పవుతుందని..: కాంగ్రెస్
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే నీటి లభ్యత ఉండదని గతంలో సీఎం కేసీఆర్ చేసిన వాదన తప్పవుతుందనే ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీని ఎగువనున్న వార్ధా వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్, రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ప్రాణహిత–చెవేళ్ల రీ డిజైనింగ్ చేసి కాళేశ్వరం నిర్మిస్తున్నారని మండిపడ్డారు.
రూ. 36 వేల కోట్ల వ్యయంతో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాదని, రూ. 86 వేల కోట్లతో 36 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు కాళేశ్వరం నిర్మించడంలో అర్థం లేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 273 టీఎంసీల నీరు ఉందని సీడబ్లూసీ గతంలో అంగీకరించిందని, ఇప్పుడు అక్కడ నీటి లభ్యతలేదని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించడం ప్రజా ధనాన్ని దుబారా చేయడమేనన్నారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తయ్యే సరికి పెట్టుబడి వ్యయం రూ. 2లక్షల కోట్లుకు పెరుగుతుందని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంజనీర్ల మధ్య వాగ్వాదం
కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాల్వలకు బదులు పైపుల సాయంతో ఆయకట్టుకు నీరు సరఫరా చేయాలని సీఎం పరిశీలిస్తున్నారని, దీంతో టీఎంసీతో 20 వేల ఎకరాలు సాగు చేయడానికి వీలు కలుగుతుందని రిటైర్డు ఇంజనీర్ వెంకట రామారావు తెలిపారు. ఏఎంఆర్ ఎత్తిపోతల తరహాలోనే కాళేశ్వరం లిఫ్టు కూడా విజయవంతమవుతుందని మరో రిటైర్డు ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. అయితే కొందరు రిటైర్డు ఇంజనీర్లు ప్రభుత్వ తప్పులను సమర్థిస్తున్నారంటూ మరికొందరు ఇంజనీర్లు వాగ్వాదానికి దిగారు.
ప్రాజెక్టు వ్యయం తగ్గించుకోడానికి సూచించిన అంశాలు
♦ తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించడంతో ఏటా రూ. 1,000 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల భారం పడనుంది. ఎల్లంపల్లి బ్యారేజీకి నీటి తరలింపునకు విద్యుత్ చార్జీలు 5 రేట్లు పెరుగుతాయి.
♦ తుమ్మిడిహెట్టి నుంచి ఏడాది పొడుగునా తక్కువ ఖర్చుతో నీరు తరలించుకునే అవకాశం ఉండగా దీనికి బదులు అవసరం లేని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నవరం బ్యారేజీల నిర్మాణానికి రూ. వేల కోట్ల ఖర్చులు చేయడం సమర్థనీయం కాదు.
♦ తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించవచ్చు. కానీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తుండటంతో ఈ అవకాశం లేకుండా పోయింది.
♦ తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించినా 152 మీటర్ల ఎత్తుకు సమానంగా నీటిని తరలించుకోవచ్చు. దీనికోసం డిజైన్లలో మార్పులు చేసుకోవాలి.
♦ మల్లన్నసాగర్ వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదు. ఇమామాబాద్ దగ్గర 0.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా 156 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉండగా, ఇక్కడినుంచి 120 రోజుల్లో 90 టీఎంసీల నీరే తరలించే అవకాశం ఉంది. ఈ నీళ్లు సాగునీటి అవసరాలకే సరిపోవు. తాగునీరు, పరిశ్రమలకు నీళ్లు రావు. భవిష్యత్‌లో ఇమామాబాద్ బ్యారేజీ సామర్థ్యం పెంచితే నిర్మాణ వ్యయం భారీగా పెరగనుంది. కాబట్టి మల్లన్నసాగర్ వద్ద 5 టీఎంసీల రిజర్వాయర్ సరిపోతుంది.
♦ దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద లినమెంట్ మల్లన్నసాగర్‌కు అనుకుని ఉంది. అక్కడ భారీ డ్యాం నిర్మిస్తే భూకంపాలొచ్చే ప్రమాదముంది.
♦ కాళేశ్వరం కింద 200 టీఎంసీలతో 18.5 లక్షల కొత్త ఆయకట్టు, 18.80 లక్షల పాత ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 37.30 లక్షల ఆయకట్టుకు నీటి సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. టీఎంసీతో 16 వేల ఎకరాలకు నీరు అందిస్తామని పేర్కొంటున్నా ఇంతవరకు ఎక్కడా టీఎంసీతో 10 వేల ఎకరాలకు మించి సాగు జరగలేదు. ఈ లెక్కన కాళేశ్వరం కింద ఏటా 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు మించి నీరందదు.
Comments
Please login to add a commentAdd a comment