
రోడ్డుమార్గంలోనూ రాహుల్ పలకరింపులు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
11న రాత్రి నిర్మల్‌లోనే బస...
12న పాదయాత్ర... అదేరోజు రాత్రి ఢిల్లీకి
హైదరాబాద్: ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి రాష్ట్రంలో పాదయాత్ర తలపెట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి నిర్మల్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ మధ్యలో రైతు ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఈనెల 11న సాయంత్రం నాలుగు గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఈ మార్గంలో ఆయన తూప్రాన్, కామారెడ్డి, బాల్కొండ, ఆర్మూరులలో రైతు ప్రతినిధులు, రైతులతో మాట్లాడతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌గాంధీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన గురువారం గాంధీభవన్‌లో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జె.గీతారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
శంషాబాద్ విమానాశ్రయంలోనే రాహుల్ కొద్దిసేపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమవుతారని ఉత్తమ్ వెల్లడించారు. 11న రాత్రి ఆయన నిర్మల్‌లో బసచేస్తారని చెప్పారు. 12న ఉదయం 7 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని వడ్యాల, రాచాపూర్, పొట్టుపల్లి, లక్ష్మణ్‌చాందా, కొరటికల్ గ్రామాలలో పాదయాత్ర చేస్తారని ఉత్తమ్ వివరించారు. పాదయాత్రలో పాల్గొన్నవారిని ఉద్దేశించి కొరటికల్‌లో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తారని చెప్పారు. అదేరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుని, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారని ఆయన వివరించారు. రైతు కుటుంబాలకు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేసే విషయంపై ఇంకా చర్చించలేదని ఉత్తమ్ చెప్పారు.
10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని సీఎల్‌పీ నాయకుడు జానారెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇతర ఆర్థిక సర్దుబాటుకోసం రూ. 5 లక్షలను ఇవ్వాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు భరోసా కల్పించడానికి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికే రాహుల్‌గాంధీ పర్యటిస్తున్నారని, 10 జిల్లాల్లోని రైతులంతా భారీగా తరలిరావాలని జానా కోరారు.