రైతులకు ఇప్పట్లో ‘పెట్టుబడి సాయం’ అందేలా కనిపించడం లేదు. ఈ నెల 20 నుంచే రైతులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రారంభించాల్సి ఉండగా, సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకు రైతులకు ఎదురుచూపులు తప్పేలా లేవు.
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకుగాను సాగు ఖర్చుల కోసం ఎకరాకు రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించేందుకు నిర్ణయించింది. ఖరీఫ్‌కు సంబంధించి మూడు విడతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ నెల 20 నుంచి తొలి విడత చెక్కులు పంచాలని భావించింది. ఇందుకోసం ఇప్పటికే జిల్లాకు పెట్టుబడి సాయం కింద చెక్కులు కూడా చేరాయి. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చెక్కులు పంపిణీ చేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, అయితే చెక్కుల పంపిణీలో కొంత జాప్యం నెలకొంది. ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తదుపరి ఆదేశాలు అందిన తరువాతనే గ్రామాల్లో సభలను నిర్వహించి పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయనున్నారు.
జిల్లాకు చేరిన రూ.66 కోట్ల విలువైన చెక్కులు
తొలి విడతలో జిల్లాలోని 77,889 మంది రైతులకు రూ.66 కోట్ల విలువ చేసే 78,059 చెక్కులను పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన చెక్కులను రాజధాని నుంచి తీసుకవచ్చి మండలాల వారీగా సరఫరా చేశారు. రైతు పేరుతో ముద్రించిన చెక్కులను సిద్ధంగా ఉంచినా, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. ఇందుకు కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం రైతులకు డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంతవరకు డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాలేదు. అయితే పాత పట్టాదారు పుస్తకాలను పరిశీలించి వాటి ఆధారంగానే చెక్కులను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా పెట్టుబడి సహాయం చెక్కుల కార్యక్రమం వాయిదా పడటంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రబీ సీజన్ పూర్తి కావడంతో రానున్న ఖరీఫ్‌కు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పెట్టుబడి చెక్కులు చేతికందితే కొంత ఊరట కలిగేదని రైతులు భావిస్తున్నారు.
ఆదేశాలు అందిన తరువాతే..
పెట్టుబడి సాయం చెక్కులు జిల్లాకు చేరాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం. తదుపరి ఆదేశాలు అందిన తరువాతనే చెక్కులు పంపిణీ చేసేందుకు గ్రామసభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తాం. – గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment