బంజారాహిల్స్: మహానగరం అమ్మలాంటిది.. బతకుదెరువు కోసం ఎక్కడి నుంచి ఎవరొచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. ఈ కోవలోనే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన కొన్ని కుటుంబాలకు ఉపాధి చూపించింది. 15 ఏళ్ల క్రితమే నగరానికి వలస వచ్చిన వీరు ఇక్కడే నివాసం ఉంటూ సీజన్‌కు అనుగుణంగా వస్తువులు విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు చౌరస్తా, మాదాపూర్ చౌరస్తా, సికింద్రాబాద్ ప్యాట్నీ, బేగంపేట, హిమాయత్‌నగర్, పంజగుట్ట చౌరస్తా, ఖైరతాబాద్ చౌరస్తాతో పాటు లుంబినీ పార్కు, ఎన్‌టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్‌లో సుమారు వంద కుటుంబాలకు చెందిన ప్రజలు తమ సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తూ వస్తువులు విక్రయిస్తున్నారు. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాల్లో జాతీయ జెండాలు విక్రయిస్తుంటారు. న్యూ ఇయర్, దీపావళి, క్రిస్మస్ తదితర పర్వదినాల సందర్భంగా పూల బొకేలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు.
ఎండా, వానాకాలాల్లో రంగురంగుల గొడుగులు అమ్ముతుంటారు. ధర తక్కువగా ఉండడం.. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండడంతో వీటిని కొనేందుకు నగరవాసులు మక్కువ చూస్తున్నారు. ఇతర కాలాల్లో రొట్టెలు కాల్చుకునే టెర్రాకోట మట్టి పెనాలు విక్రయిస్తుంటారు. అంతేకాదు.. బెలూన్లు, జ్యూట్ బ్యాగ్‌లు సైతం వీరు అమ్ముతుంటారు. వారానికి ఒకసారి వీరు తమ ఉత్పత్తులను మారుస్తుంటారు. నగరమంతా ఒకేసారి ఒకే రకమైన ఉత్పత్తులు అందుబాటులోకి తేవడం తమ ప్రత్యేకత అని శంకర్ అనే రాజస్థానీ యువకుడు చెప్పాడు. ఓ చౌరస్తాలో గొడుగులు అమ్మితే నగరమంతా తమ కుటుంబాలన్నీ గొడుగులే విక్రయిస్తుంటాయన్నాడు. నగరంలో తమ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని మనీషా అనే యువతి పేర్కొంది. మొత్తానికి రాజస్థానీల ఉత్పత్తులకు నగరవాసులు ఫిదా అవుతున్నారనే చెప్పాలి. అయితే, ఈ కుటుంబాల్లోని చిన్నారులు కూడా పెద్దవారితో పాటే వ్యాపారంలో నిమగ్నమవడంతో అక్షర జ్ఞానానికి నోచుకోకపోవడం బాధ కలిగించే అంశం.
Comments
Please login to add a commentAdd a comment