శుక్రవారం రాత్రి నిర్మానుష్యంగా కనిపించిన మక్కామసీద్, చార్మినార్ పరిసరాలు
చార్మినార్: నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ పవిత్ర మాసం శుక్రవారం రాత్రి అడుగిడింది. ఈ మేరకు రుహియ్యతే హిలాల్ కమిటీ అధ్యక్షులు మౌలానా ఖుబ్బుల్ పాషా షుత్తరీ ప్రకటించారు. నేటి (శనివారం) తెల్లవారుజామున 4.29 గంటలకు నిర్వహించే సహర్‌తో మొదటి రోజాతో ప్రారంభమైంది. లాక్‌డౌన్ కారణంగా నగర చరిత్రలో ఎన్నడూలేని విధంగా సామూహిక ప్రార్థనలు రద్దయ్యాయి. దీంతో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా మసీదులన్నీ బోసిపోయాయి. ఈ ఏడాది రంజాన్ పవిత్ర కార్యం మొత్తం ఇళ్లలోనే కొనసాగనుంది. అయిదు పూటల నమాజ్, రాత్రి తరావీలతో పాటు సాయంత్రం ఇఫ్తార్ (ఉపవాస దీక్షల విరమణ) కూడా ఇళ్లలోనే పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈసారి రంజాన్ నెలవంక దర్శనమిచ్చినా ఎలాంటి హడావుడి, సందడి లేకుండా పోయింది. రంజాన్ మాసంలో ముస్లింలు నిత్యం భక్తిశ్రద్ధలతో ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేస్తారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సహర్‌తో రంజాన్ ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం అనంతరం ఇఫ్తార్ విందులకు హాజరవుతుంటారు. ఒకవైపు ఉపవాస దీక్షలు కొనసాగిస్తూనే.. మరోవైపు నిత్యావసరాల వస్తువులు, గృహోపకరణాల కొనుగోళ్లకు షాపింగ్ చేసేవారు. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం రంజాన్ మాసంలో ఆ పరిస్థితులు లేకుండాపోయాయి. ఇళ్లలో సైతం సామూహిక ప్రార్థనలు, విందులపై ఆంక్షలు విధించారు. మసీదుల ద్వారా యథావిధిగా అయిదు పూటలు అజాన్‌తో పాటు, ఉపవాస దీక్షల సైరన్‌లు మోగుతాయి. మసీదులో నమాజ్‌కు మాత్రం కేవలం ఇమామ్, మౌజన్‌తో పాటు మసీదు కమిటీకి సంబంధించిన మరో ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా భౌతిక దూరం పాటించి నమాజ్ ప్రక్రియ పూర్తి చేయాలి.
అల్లాహూ అక్బర్ అంటూ దైవ ప్రార్థనలో నిమగ్నమైన ముస్లింలు
మక్కా మసీదులో అన్నీ రద్దు..
లాక్‌డౌన్‌లో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. అంతా సామాజిక దూరం పాటించాలి. దీంతో ఎవరినీ మక్కా మసీదుకు రానివ్వడం లేదు. ప్రతి శుక్రవారం మక్కా మసీదులో నిర్వహించే యౌముల్ ఖురాన్ సభలు కూడా రద్దు చేశాం. అల్‌విదా జుమ్మా నమాజ్‌లు సైతం ఉండకపోవచ్చు. ఒకవేళ మే 7 అనంతరం లాక్‌డౌన్ ఎత్తి వేసినప్పటికీ.. సామాజిక దూరం పాటించాల్సిందే. రంజాన్ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.30 లక్షల నిధులు ప్రభుత్వ ఖజానాలో అలాగే ఉన్నాయి. మక్కా మసీదుకు ఎవరూ రానప్పుడు నిధుల వినియోగం అవసరం లేదు. ఇఫ్తార్ విందులు కూడా ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలి.– మహ్మద్ అబ్దుల్ ఖాదర్ సిద్దిఖీ, మక్కా మసీద్ సూపరింటెండెంట్
రౌండ్ ది క్లాక్ విద్యుత్ సేవలు..
రంజాన్ మాసంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశాం. చార్మినార్, ఆస్మాన్‌గఢ్, బేగంబజార్ మూడు డీఈల పరిధిలో స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం. డివిజన్‌కు 15 మంది చొప్పున రాత్రిపూట విధి నిర్వహణలో ఉంటారు. రంజాన్ మాసంలో మూడు డివిజన్లకు 45 మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తారు. 24 అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటు లో ఉంచాం. ఇందులో 10 ట్రాన్స్‌పార్మర్లు 500 కేవీఏ, మరో పది 100 కేవీఏ, నాలుగు 160 కేవీఏ ఉన్నాయి. వీటికి తోడు 23 మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచాం. ఎక్కడైనా విద్యుత్ లోడ్ సమస్యలు తలెత్తితే వీటిని ఏర్పాటు చేస్తాం. – ఖ్వాజా అబ్దుల్ రెహ్మాన్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ దక్షిణ మండలం ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment