సాక్షి,పెద్దపల్లి: రామగుండం బల్దియాలో అవిశ్వా సంపై కౌంట్‌డౌన్ మొదలైంది. మేయర్, డిప్యూటీ మేయర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2న ప్రత్యేక సమావేశం నిర్వహించనుండడంతో, రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అవిశ్వాసం తీర్మానం ఇచ్చి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా.. ప్రత్యేక సమావేశం తేదీ ప్రకటించకపోవడంతో కాస్త అయోమయం నెలకొంది. ఎట్టకేలకు వచ్చే నెల 2న అవిశ్వాసం తీర్మాన ప్రక్రియ చేపట్టనుండడంతో ఇరువర్గాల్లో కదలికవచ్చింది.
నోటీసులు జారీ
అవిశ్వాసం ఆగస్టు 2న పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడి కావడంతో అధికారులు తమ ప్రక్రి యను మొదలు పెట్టారు. అవిశ్వాసం తీర్మానం పెట్టిన కార్పొరేటర్లకు బుధవారం నోటీసులు అందజేశారు. మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, డిప్యూటి మేయర్ సాగంటి శంకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 39 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. అయితే ఇందులో ఇద్దరి సంతకాల్లో తేడా రావడంతో 37 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మరో ముగ్గురితో కలిపి మొత్తం 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఉన్నారని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది.
కాంగ్రెస్‌పైనే మేయర్ ఆశలు!
అవిశ్వాసం తేదీ ఖరారు కావడంతో అందరి దృష్టి మేయర్ కొంకటి లక్ష్మినారాయణపై పడింది. ఇప్పటికే దాదాపు 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడం, 37 మంది సంతకాలు చేసినట్లు ‘అధికారికంగా’ గుర్తించడంతో మేయర్ ఏం చేయబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. టీఆర్‌ఎస్ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడంతో మేయర్ ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా 20 మంది కార్పొరేటర్లు ఉండడంతో ఆ పార్టీ పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇందు లో ఇప్పటికే 9 మంది టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 11 మందిలో తొమ్మిది మంది అ విశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతో పాటు తానంటే అభి మానం ఉన్న కార్పొరేటర్లు సహకరిస్తే ఎలాగోలా గట్టెక్కచ్చని మేయర్ భావిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో భిన్న వాదనలు
అవిశ్వాసంపై కాంగ్రెస్ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసానికి బలంగా మద్దతు పలుకుతుండగా, పార్టీ నేతలు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అవిశ్వాసంపై బహిరంగంగా వ్యాఖ్యానించడం లేదు. అయితే మేయర్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు మాత్రం, అవిశ్వాసంపై పునరాలోచన లేదని స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ‘అవిశ్వాసంలో మేయర్‌కు అనుకూలంగా వ్యవహరించి టీఆర్‌ఎస్‌ను దెబ్బతీస్తే ఎలా ఉంటుందనే ఓ ఆలోచనను మా నాయకులు చేశారు. కానీ అలాంటి ఆలోచన పెట్టుకోవద్దని, ప్రతిపక్ష పార్టీగా తామే అవిశ్వాసం పెట్టామని.. ఇప్పుడు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాం’ అని ఓ కాంగ్రెస్ కార్పొరేటర్ ‘సాక్షి’కి వెల్లడించారు.
ఏదేమైనా అవిశ్వాసం తేదీ ప్రకటించడంతో రామగుండంలో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment