ప్రామాణికంగా రేషన్‌కార్డు: ఈటెల
విపక్షాల డిమాండ్
పింఛన్ల పంపిణీ తరువాతే రేషన్ కార్డుల జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు రేషన్‌కార్డులనే ప్రామాణికంగా తీసుకోవాలని శాసనసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. కొత్త రేషన్ కార్డులు కేవలం రేషన్ సరుకులు పొందడానికే పనికొస్తాయని.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలకు వాటితో సంబంధం ఉండదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పడంపై నిరసన వ్యక్తంచేశాయి. ఇందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తొలుత బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు ఈటెల సమాధానమిస్తూ.. రేషన్‌కార్డులు నిత్యావసరాలు పొందడానికే పరిమితమని స్పష్టం చేశారు.
పింఛన్ల పంపిణీ తర్వాతే రేషన్‌కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దళారులు, లంచాలకు తావులేకుండా.. పార్టీల ప్రమేయం లేకుండా పేద కుటుంబాలకు రేషన్ బియ్యం అందిస్తామని, ఆధార్ కార్డులకు దీనితో సంబం ధం లేదన్నారు. టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ‘నాలెక్క కొత్త బట్టలు వేసుకుంటే కార్డులు ఇవ్వరట.. రెండున్నర ఎకరాలుంటే ఇవ్వరట.. 653 జీవోలో ఏముంది?..’ అని నిలదీశారు. పేదలందరికీ రేషన్‌కార్డులను అందజేయాలని.. సరుకుల పంపిణీతో పాటు, పింఛన్లు సహా సంక్షేమ పథకాలన్నింటికీ కార్డులను ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఇక మంత్రి చేసిన వ్యాఖ్యలు తమకు ఏ మాత్రం సంతృప్తి కలిగించలేదని కాంగ్రెస్ సభ్యులు విమర్శిం చారు. వితంతువులు, వికలాంగులకు పింఛన్లపై స్పష్టమైన విధానాన్ని పాటించటం లేదని మండిపడ్డారు. కాగా.. రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీకి సంబంధం లేదనడంపై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వైఎస్సార్‌సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు సభలోనే ఉండి నిరసన వ్యక్తంచేశారు.
ఆరోగ్యశ్రీ అమల్లోనే ఉంది: ఈటెల
కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేవరకు పాతకార్డులపై బియ్యం అందిస్తున్నామని.. ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసేయలేదని, అది అమల్లోనే ఉందని మంత్రి ఈటెల స్పష్టంచేశారు. ‘‘పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.1,578 కోట్లు ఇచ్చినం. ఈసారి రూ. 2,700 కోట్లు ఫీజులకు కేటాయించినం..’ అని ఆయన చెప్పారు.