కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం అసెంబ్లీలో క్షమాపణ చెప్పారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోమవారం అసెంబ్లీలో క్షమాపణ చెప్పారు. సభలో గందరగోళ పరిస్థితుల్లో జాతీయ గీతం వినిపించలేదని ఆయన అన్నారు. సభలో ఉద్దేశపూర్వకంగా జాతీయ గీతాన్ని అవమానించలేదని సంపత్ కుమార్ తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజున సభ కార్యక్రమాలు సజావుగా లేవన్నారు. జాతీయ గీతం పాడుతున్నప్పుడు ముందుగా ప్రకటన చేయాలని.. చేశారా అని సంపత్ ప్రశ్నించారు. జాతీయ గీతం ఒక్క టీఆర్ఎస్ పార్టీది కాదని, 121 కోట్ల మంది భారతీయులదన్నారు.
జాతీయ గీతాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవద్దని సంపత్ కుమార్ సూచించారు. అధికార పక్షం వివరణ ఇస్తే సరిపోతుందని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నామన్నారు. అధికార పక్షానికి దమ్ముంటే వీడియో ఫుటేజ్ బయటపెట్టాలని సంపత్ కుమార్ సవాల్ చేశారు. సభ హుందాతనాన్ని కాపాడేందుకే తాను క్షమాపణ చెప్పానన్నారు. పొరపాటున జరిగిన తప్పుకు చింతిస్తున్నానని సంపత్ కుమార్ తెలిపారు. ఎవరు గొడవపడ్డారో పూర్తి ఫుటేజ్ చూపించి వాస్తవాలు బయటపెట్టాలన్నారు.