
గిరిజనులకూ మూడెకరాలు
కేసీఆర్ ప్రకటన లంబాడీ యువతులకూ కల్యాణ లక్ష్మి
టీఆర్‌ఎస్‌లోకి రెడ్యానాయక్, కవిత
సాక్షి, హైదరాబాద్: భూమిలేని లంబాడీ, గిరిజన వ్యవసాయాధారిత కుటుంబాలకు కూడా మూడెకరాల భూమిని ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దళిత, మైనారిటీ యువతులకు ఇచ్చినట్లుగానే.. గిరిజన, లంబాడీ యువతుల వివాహాల కోసమూ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే ఎం.కవిత కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో గిరిజనుల అభివృద్ధికోసం కృషి చేస్తున్నదని.. వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని వెల్లడించారు. దళిత, మైనారిటీ యువతులకు అందజేస్తున్న విధంగా గిరిజన, లంబాడీ యువతులకు కూడా కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తామని హామీనిచ్చారు. రెడ్యానాయక్ వంటి సీనియర్ నాయకుడు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని చిల్లరమల్లర రాజకీయ చేరికగా చూడలేమని.. తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలనే రెడ్యానాయక్ చేరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటిదాకా రాజకీయ విభేదాలేమైనా ఉంటే వాటిని మరిచిపోయి ముందుకు పోదామని.. సీనియర్ నాయకుడిగా అన్నివర్గాలను కలుపుకొని పోవాలని రెడ్యానాయక్‌కు సూచించారు. రాజకీయాల్లో ఎవరూ అభద్రతకు గురికావొద్దని, ఎవరి ప్రాధాన్యతలు వారికి ఉంటాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కిషన్‌రావు, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.