
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల తిరస్కరణ భావం మొదలైందని, లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన కేటీఆర్‌కు బుధవారం బహిరంగ లేఖ రాశారు. ‘ఏ రాజకీయ పార్టీకైనా వర్తమానంలో ప్రజల ఆదరణ ఎలా ఉందన్నదే ప్రామాణికం. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటున్నారు.
గత డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. మీ సొంత గడ్డ సిద్ధిపేట, మీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్లలలోనే మెజారిటీలు దారుణంగా పడిపోయాయి. కరీంనగర్, నిజామాబాద్ లో మీ కుటుంబ సభ్యులు ఓడిపోయారు. టీఆర్‌ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి ఇదే సంకేతం. మల్కాజ్ గిరిలో నా గెలుపు గురించి మీరు మాట్లాడే మాటలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి. 2009లో సిరిసిల్లలో మీ పరిస్థితి ఏమిటి? చావుతప్పి కన్నులొట్టబోయినట్టు స్వతంత్ర అభ్యర్థి పై కేవలం 171 ఓట్లతో గట్టెక్కారు. మల్కాజ్ గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారు.’అని ఆ లేఖలో రేవంత్ పేర్కొన్నారు.