సాక్షి, సిటీబ్యూరో: రైల్వే అడ్వాన్స్ బుకింగ్‌లు తిరిగి మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా గత 10 రోజులుగా నిలిచిపోయిన రిజర్వేషన్ బుకింగ్‌ల కోసం ప్రయాణికులు క్రమంగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ కేంద్రాలు మూసి ఉంచడంతో ఐఆర్‌సీటీసీ నుంచి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ప్రయాణికులు తమ రిజర్వేషన్లను బుక్ చేసుకొనే సదుపాయం ఉంది. లాక్‌డౌన్ పొడిగింపు ప్రతిపాదనలు లేవని కేంద్రం ఇటీవల ప్రకటించడంతో పాటు, లాక్‌డౌన్ తర్వాత రాకపోకలు సాగించేవారు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చునని పేర్కొనడంతో గత రెండ్రోజులుగా ప్రయాణికులు రిజర్వేషన్లు బుక్ చేసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేస్తే ఏప్రిల్ 16 తర్వాత హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రైల్వే అన్ని రకాల చర్యలు చేపట్టిందని, రైళ్లను కెమికల్ వాష్ చేయడంతో పాటు, ఎప్పటికప్పుడు శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్ అనంతరం కూడా రైళ్ల నిర్వహణలో పూర్తి జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో గత 10 రోజులుగా ఎక్కడికక్కడ ప్రయాణికుల రాకపోకలు స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. అత్యవసర రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఈ నెల 15 నుంచి రైళ్లు పట్టాలెక్కితే ప్రయాణికుల రాకపోకలు తిరిగి మొదలుకావొచ్చు
ప్రతిరోజూ 2.5 లక్షల మంది రాకపోకలు
సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, తదితర రైల్వేస్టేషన్ల నుంచి ప్రతిరోజూ 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ నుంచే ప్రతిరోజూ 1.8 లక్షల మంది ప్రయాణిస్తారు. రోజుకు కనీసం 200 రైళ్లు హైదరాబాద్ నుంచి నడుస్తాయి. లాక్‌డౌన్‌తో ఈ రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఈ నెల 15 నుంచి లాక్‌డౌన్ తొలగించినప్పటికీ రద్దీ అంతగా ఉండకపోవచ్చునని, కరోనా భ యం దృష్ట్యా తప్పనిసరిగా వెళ్లాల్సిన వారు. అత్యవసర ప్రయాణికులు మాత్రమే బయలుదేరొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం లాక్‌డౌన్ తొలగించిన వెంటనే రైళ్లు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈ లోపు ఏవైనా అనుకోని సంఘటనలు చోటుచేసుకొని లాక్‌డౌన్ కొనసాగించే పరిస్థితులు తిరిగి ఉత్పన్నమైతే ఇప్పటివరకు రిజర్వేషన్లు బుక్ చేసుకున్న వారు మరోసారి రద్దు చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాల్సిరావచ్చు’అని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఎయిర్‌లైన్స్ బుకింగ్‌లు ఓపెన్..
లాక్‌డౌన్ తొలగించిన అనంతరం దేశీయ విమానాల రాకపోకలు కూడా మొదలుకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్‌లను ఓపెన్ చేశాయి. మరోవైపు దేశీయ విమానాల రాకపోకల కోసం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సిద్ధమవుతోంది. ఎయిర్‌పోర్టును పూర్తిగా కెమికల్ వాష్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ శానిటేషన్ ప్రక్రియ చేపట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజూ 60 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుండగా వీరిలో సుమారు 50 వేల మంది దేశీయ ప్రయాణికులే ఉంటాయి. పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్‌లు ప్రారంభించినప్పటికీ ప్రయాణికుల రద్దీ వెంటనే కనిపించకపోవచ్చునని, అందుకు కొంత సమయం పట్టవచ్చునని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment